నిర్లక్ష్యం వహిస్తే దండనే
మండల, జెడ్పీ ఎన్నికలపై శిక్షణ
17 నుంచి 20 వరకు నామినేషన్లు
21న పరిశీలన
24న ఉపసంహరణ
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్, ఎన్నికల అథారిటీ జిల్లా అధికారి ఎం.రఘునందన్‌రావు హెచ్చరించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో శనివారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ జారీ అయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఎన్నికల కార్యకలాపాలకు సం బంధించిన సమాచారం జిల్లా అధికారిక వెబ్సైట్ ‘కృష్ణా డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్’లో అందుబాటులో ఉంచామని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం, నిబంధనలపై రిటర్నింగ్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. జెడ్పీ సీఈఓ, జిల్లా పరి షత్ అధికారులతో రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. మండల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులు తనిఖీ చేసి ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలని చెప్పారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో వీడియో తీయించాలన్నారు.
17వ తేదీ నాటికి అన్ని పోలింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను ముందుగా గుర్తించి వెబ్ కాస్టింగ్, వీడియో తీయించాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ కేంద్రాలకు తరలించే సమయంలో అనధికారిక వ్యక్తుల ప్రమే యం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
అప్రమత్తంగా ఉండండి : జేసీ
ఎన్నికల నిర్వహణకు తక్కువ వ్యవధి ఉండటం వల్ల రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ జె.మురళీ సూచించారు. 17 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని చెప్పారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుగా నిర్ణయించామన్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించాలని తెలిపారు. ఏప్రిల్ 6న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అభ్యర్థుల నామినేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హత లేని వాటిని మాత్రమే తిరస్కరించాలన్నారు.
రిజర్వేషన్ల వర్తింపు, నామినేషన్లతో పాటు నగదు డిపాజిట్, పరిశీలన, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అంశాల్లో ఎన్నికల మార్గదర్శకాలను తూ.చా. తప్పకుండా పాటించాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ బిఎల్.చెన్నకేశవ రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శన్, డీపీవో ఆనంద్ పావర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలపై రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, సబ్ కలెక్టర్ డి.హరిచందన పాల్గొన్నారు.