Kroll
-
మాకూ సైబర్ ముప్పుంది
సాక్షి, హైదరాబాద్: సైబర్ ముప్పునకు గురవుతున్న వారిలో అన్ని రంగాల్లోని ప్రముఖులు సైతం ఉంటున్నారు. సాధారణ వ్యక్తులను టార్గెట్ చేయడం కంటే పెద్ద కంపెనీల్లోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కొట్టేయొచ్చన్న ధోరణిలో ఆన్లైన్ మోసగాళ్లు ఉంటున్నారు. దీంతో తమకూ ఆర్థిక నేరాల ముప్పు (ఫైనాన్షియల్ క్రైం రిస్క్) తప్పదన్న ఆందోళనలో భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఉంటున్నారు.క్రోల్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 96 శాతం మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ఈ ఏడాది ఫైనాన్షియల్ క్రైం రిస్క్ తప్పదన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత దాడులకు తాము లక్ష్యంగా ఉన్నామని భారత్‌లోని 76 శాతం మంది, ప్రపంచవ్యాప్తంగా 68 శాతం మంది పేర్కొన్నారు.భారతీయ ఎగ్జిక్యూటివ్‌లలో 36 శాతం మంది తమ కంపెనీలు సైబర్ దాడులను ఎదుర్కొనే పటిష్ట వ్యవస్థలు కలిగి ఉన్నట్టు తెలిపారు. కంపెనీల వద్ద సరైన సాంకేతికత లేకపోవడం సైబర్ దాడుల ముప్పు పెరిగేందుకు కారణమని 36 శాతం మంది వెల్లడించారు. అయితే, ఏఐ, మెషీన్ లెర్నింగ్‌తో సానుకూల ప్రభావం ఉంటుందని 32 శాతం మంది.. వీటితో ముప్పు పెరిగిందని 52 శాతం మంది చెప్పారు. కంపెనీలు సైబర్ భద్రత ముప్పును తప్పించుకునే పటిష్ట వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్న 59 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
కార్పొరేట్ మోసాలు పెరుగుతున్నాయ్!
ముంబై: దేశీ కంపెనీలకు కార్పొరేట్ మోసాల బెడద అంతకంతకూ తీవ్రతరమవుతోంది. అంతర్జాతీయ ఏజెన్సీ ‘క్రాల్’ నిర్వహించిన గ్లోబల్ ఫ్రాడ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తమకు ఇలాంటి కార్పొరేట్ మోసాలతో ఈ ఏడాది చాలా ఇబ్బందులు ఎదురైనట్లు సర్వేలో పాల్గొన్న 71 శాతం దేశీ కంపెనీలు పేర్కొనడం గమనార్హం. క్రితం ఏడాది సర్వేలో ఇలా పేర్కొన్న కంపెనీలు 67 శాతమే. కాగా ఆస్తుల నష్టం, లంచాలు, అంతర్గత సమాచార చోరీ వంటి అనేక రకాలైన కార్పొరేట్ మోసాలను 69 శాతం దేశీ కంపెనీలు చవిచూస్తున్నాయని క్రాల్ పేర్కొంది. ఇక అవినీతి, లంచాలకు సంబంధించిన మోసాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సర్వేలో పాల్గొన్న 37 శాతం(క్రితం ఏడాది 32 శాతం) సంస్థలు వెల్లడించాయి. కొనుగోళ్ల సంబంధ మోసాలు, పెట్టుబడులకు అనుమతుల్లో జాప్యం, లంచాలు వంటివి వ్యాపారాలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని అత్యధిక శాతం దేశీ, అంతర్జాతీయ కంపెనీలు అభిప్రాయపడినట్లు క్రాల్ ఇండియా హెడ్ రేష్మి ఖురానా పేర్కొన్నారు. జూనియర్‌స్థాయి ఉద్యోగులే ఇలాంటి మోసాలకు అత్యధికంగా పాల్పడుతున్నట్లు 69 శాతం కంపెనీలు చెప్పడం గమనార్హం.