krpreddy
-
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయామ్స్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: ‘ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి) ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఐఎన్ఎస్ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్‌ను ఎన్నుకోగా.. వివేక్ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మత్) ఉపాధ్యక్షుడిగా, తన్మయ్ మహేశ్వరీ (అమర్ ఉజాలా) కోశాధికారిగా, మేరీపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ తెలిపింది. కేఆర్పీ రెడ్డి (సాక్షి), వివేక్ గొయెంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్), అతిదేవ్ సర్కార్ (టెలిగ్రాఫ్), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ఐ.వెంకట్ (ఈనాడు), జయంత్ మమెన్ మాథ్యూ (మలయాళ మనోరమ)లు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
‘సాక్షి’ డైరెక్టర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి,హైదరాబాద్: సాక్షి మీడియా సంస్థల డైరెక్టర్ కేఆర్‌పీరెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. బుధవారం(ఏప్రిల్ 3) హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేఆర్‌పీరెడ్డికి పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పురస్కారం ప్రదానం చేశారు. ఇండియా పీఆర్ బాడీ 20వ ఫౌండేషన్ డే సందర్భంగా కేఆర్పీ రెడ్డికి అవార్డు అందజేశారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. కేఆర్పీ రెడ్డి గడిచిన మూడున్నర దశాబ్దాలుగా అడ్వర్టైజింగ్, సర్క్యులేషన్ రంగాల్లో విశేషమైన కృషి చేశారు. -
ఐటీ రూల్స్‌లో సవరణలు ఉపసంహరించండి
న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడు కేఆర్పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సవరణలను ఈ నెల 6న నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించే అధికారాన్ని ఈ సవరణలు ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఇలాంటి సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఐఎన్ఎస్కు ఉందని గుర్తుచేశారు. మీడియా వృత్తి, విశ్వసనీయతతో ముడిపడి ఉన్న ఏ అంశంపై అయినా నోటిఫికేషన్ జారీ చేసేముందు మీడియా సంస్థలు, విలేకరుల సంఘాలతో విస్తృత, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజ నిర్ధారణ కోసం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? న్యాయ సహాయం కోరవచ్చా? అప్పీల్ చేసే హక్కు ఉంటుందా? తదితర కీలక అంశాలను నోటిఫైడ్ రూల్స్‌లో ప్రస్తావించలేదని కేఆర్పీ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బహిర్గతం చేసిన ముసాయిదా సవరణల కంటే ఈ నెల 6న నోటిఫై చేసిన కొత్త ఐటీ రూల్స్ ఏమాత్రం భిన్నంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఐటీ రూల్స్‌లో సవరణలు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని ఐఎన్ఎస్ సెక్రెటరీ జనరల్ మేరీ పాల్ స్పష్టం చేశారు. సవరణలు నోటిఫై చేసే ముందు మీడియా సంస్థలతో చర్చల కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
మొక్కలతోనే మానవ మనుగడ
‘సాక్షి’దినపత్రిక ఏడీవీటీ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి కాల్వశ్రీరాంపూర్ : మెుక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ ఉంటుందని ‘సాక్షి’ దినపత్రిక ఏడీవీటీ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాల్వరాంచంద్రా రెడ్డి ఘాట్ రోడ్డులో ఆదివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అంతకు ముందు వారి తల్లిదండ్రులు కీ.శే.కాల్వరాంచంద్రారెడ్డి, లీలాదేవి సమాధులను దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆయన సోదరుడు అశోక్ రెడ్డి, నాయకులు ఈశ్వరయ్య, గీట్ల రవీందర్ రెడ్డి, కొలవేన మల్లయ్య, పర్వతాలు, రాజేశం, తదతరులు పాల్గొన్నారు.