సీఎంకు రైతుల కష్టాలు పట్టవు
చిక్కబళ్లాపురం: రాష్ట్రంలో ఇప్పటి వరకు 430 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినా సీం సిద్ధరామయ్యకు కనిపించడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్.ఈశ్వరప్ప అన్నారు. శనివారం చిక్కబళ్లాపురం నగరంలోని శిడ్లఘట్ట సర్కిల్లో జిల్లా బీజేపీ ఏర్పాటు చేసిన రైతు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రైతుల కష్టాలు ఏ మాత్రం కనిపించడం లేదు. రోజు మొత్తం ఆయన తమ కుర్చీని ఎలా కాపాడుకోవాలో చూస్తున్నారని అన్నారు. బీజేపీలో ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.
ప్రస్తుతం బీజేపీలో ఎటువంటి బిన్నాభిప్రాయాలు లేవని పార్టీలోని నాయకులందరూ కలసికట్టుగా పని చేస్తున్నామని అన్నారు. కార్యక్రమానికి ముందు పట్టణంలోని శనిమహాత్మా దేవాలయం నుంచి ఎద్దుల బండిలో ఈశ్వరప్పతోపాటు బీజేపీ ప్రముఖ నాయకులు బీబీ రోడ్డులో ఊరేగింపుగా సాగారు. అంతకు ముందు మాజీ ఎంపీ తేజశ్విని రమేష్, ఎమ్మెల్సీ అశ్వథనారాయణ, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్ష రవినారాయణరెడ్డి బీజేపీ నాయకులు సోమశేఖర్, మంజునాథ్, ప్రేమలీలా, బచ్చేగౌడ. ఇతరులు పాల్గొన్నారు.