Kukala Nageshwara Rao
-
కేఎన్నార్‌కు కన్నీటి వీడ్కోలు
=జగన్ సహా పలువురు నేతల నివాళులు =జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు =అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కోసూరు (కూచిపూడి), న్యూస్‌లైన్ : రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అజాతశత్రువుగా పేరుతెచ్చుకున్న జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావుకు ప్రజలు, నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు. కృష్ణాజిల్లా పరిషత్‌కు దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన కేఎన్నార్‌ను కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, అధికారులు పెద్ద ఎత్తున కోసూరుకు తరలివచ్చారు. పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న కేఎన్నార్ భౌతికకాయాన్ని కడసారి దర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. ఒంగోలు గిత్తల పశుపోషకుడిగా, ద్రోణాచార్య అవార్డు అందుకున్న కుక్కల నాగేశ్వరరావును చివరిచూపు చూసేందుకు గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పలువురు నాయకులు, రైతులు, తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. నాయకుల ఘన నివాళులు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేఎన్నార్‌కు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. పామర్రు నుంచి నిమ్మకూరు, అవురుపూడి, పాలంకిపాడు మీదుగా కోసూరు చేరుకున్న ఆయన కేఎన్నార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కేఎన్నార్ భార్య కృష్ణకుమారి, పెద్ద కుమారుడు వెంకటరామ విద్యాసాగర్, చిన్న కుమారుడు మోహనకుమార్, కుమార్తె డొక్కు సీతాదేవి, అల్లుడు కాశీవిశ్వనాథ్, మేనమామ డొక్కు రామశాస్త్రులును పరామర్శించి ఓదార్చారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు రఘువీరారెడ్డి, కొలుసు పార్థసారథి, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ (పెందుర్తి), డీవై దాస్ (పామర్రు), అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, సమాచార చట్టం కమిషనర్ తాంతియాకుమారి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మహిళా కన్వీనర్ తాతినేని పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్, జలీల్‌ఖాన్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, బూరగడ్డ వేదవ్యాస్, జంగా కృష్ణకుమారి, నాగుల్‌మీరా, మాజీ ఎంపీ కేపీ రెడ్డియ్య, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్ కూచిపూడి విజయమ్మ, రాష్ట్ర గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ కూచిపూడి సాంబశివరావు, వైఎస్సార్సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, వైఎస్సార్ సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, తాడి శకుంతల, గౌతంరెడ్డి, పడమట సురేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్, టీడీపీ అధికార ప్రతినిధి యనమల రామకృష్ణుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), బందరు మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ మండవ జానకిరామయ్య, సన్‌ఫ్లవర్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, కొలనుకొండ శివాజీ, దేవినేని అవినాష్, వినియోగదారుల సంఘం చైర్మన్ సైకం భాస్కరరావు తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. శ్రీకాకుళంలో అంత్యక్రియలు... కేఎన్నార్ భౌతికకాయాన్ని తొలుత ఆయన స్వగృహం నుంచి ఒంగోలు గిత్తలను సంరక్షించే పశువులకొట్టం వద్దకు తీసుకువెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచారు. అనంతరం గ్రామం చివరివరకు మోసుకువెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో మొవ్వ మీదుగా ఘంటసాల మండలం శ్రీకాకుళం కృష్ణానది ఒడ్డున అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. -
అజాతశత్రువు ఇకలేరు
=రైతు, వ్యాపారవేత్త, రాజకీయవేత్తగా బహుముఖ సేవలు =హాయ్.. అంటూ పలకరించే ఆత్మీయుడు ఇక సెలవంటూ.. =సామాన్యుడి నుంచి అమాత్యుడి వరకు దిగ్భ్రాంతి =నేడు కేఎన్నార్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ నిండైన విగ్రహం.. నుదుట తిలకం.. గంభీరమైన వ్యక్తిత్వం.. నిష్కల్మష మనస్తత్వం.. చెదరని చిరునవ్వు ఆయనకు ఆభరణం.. అన్నా.. తమ్ముడూ.. అమ్మా.. చెల్లీ.. అంటూ ఆప్యాయపు పిలుపు.. కలుపుగోలుతనం.. ఆయన సొంతం.. అందుకేనేమో ఆయన అజాతశత్రువుగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు.. ఆయనే జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్). ఆయన పంచె కడితే రైతు.. సూటు వేస్తే వ్యాపారవేత్త.. ఖద్దరు చొక్కా, ప్యాంటు ధరిస్తే రాజకీయవేత్త.. ఇలా ఒకే జీవితంలో ఇన్ని రంగాల్లో రాణించి విశేష సేవలు అందించిన ఘనకీర్తి ఆయనది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించిన కేఎన్నార్ జిల్లాకు అందించిన బహుముఖ సేవలు విశేషం. అలాంటి అజాతశత్రువు ఇకలేరన్న సంగతి తెలుసుకున్న జిల్లా వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిద్ర నుంచే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, బంధువులు, ఆత్మీయులు, మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షి, మచిలీపట్నం : రైతు కుటుంబానికి చెందిన కేఎన్నార్ (57) వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసుకునేలా జెడ్పీ చైర్మన్ పదవిని నిర్వర్తించారు. జిల్లా వైఎస్సార్సీపీలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్న ఆయన రాజకీయంగా మరింత రాణిస్తారని అనుకుంటున్న తరుణంలో హఠాన్మరణం చెందారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా పాల్గొన్నారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల సదస్సులోనూ పాల్గొని ‘పంచాయతీ నిధులు-విధులు’ అంశంపై దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం మొవ్వ మండలంలోని తన స్వగ్రామం కోసూరు వచ్చిన ఆయన అక్కడ భోజనం చేసి మచిలీపట్నంలోని మాచవరంలో ఉన్న తన కార్యాలయానికి వచ్చి రాత్రి ఒంటి గంట వరకు కంప్యూటర్లో తన మెయిల్స్ చెక్ చేసుకుని అనంతరం నిద్రపోయారు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, షేవింగ్ చేసుకుని నలతగా ఉందని మళ్లీ పడుకున్నారు. గంట వరకు తనను ఎవరూ లేపవద్దని కార్యాలయ సిబ్బందికి చెప్పారు. ఉదయం 9.30 గంటల సమయంలో కార్యాలయ సహాయకుడు సుఖేష్ వెళ్లి ‘సార్ టిఫిన్ తెమ్మంటారా’ అని అడిగాడు. ‘వద్దు.. కాసేపు పడుకుంటా’ అని చెప్పిన కేఎన్నార్ నిద్రపోయారు. సుమారు 10.30 గంటల సమయంలో పార్టీ పెడన కో ఆర్డినేటర్ ఉప్పాల రాంప్రసాద్ అక్కడికి రావడంతో కేఎన్నార్‌ను నిద్రలేపేందుకు కార్యాలయ సిబ్బంది వెళ్లారు. బెడ్రూంలో మంచానికి, బాత్రూంకు మధ్య అపస్మారక స్థితిలో కేఎన్నార్ పడి ఉండటాన్ని గమనించి వెంటనే వైద్యుడిని తీసుకొచ్చారు. అప్పటికే శరీరం చల్లబడి, పల్స్ కొట్టుకోవడం తగ్గిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా ప్రభుత్వాస్పపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రకాశరావు, డాక్టర్లు రంగరాజన్, వీరంకి రామ్మోహన్, అల్లాడి శ్రీనివాస్, వినయ్‌కుమార్‌లు పరీక్షలు చేసి కేఎన్నార్ గుండెపోటుతో మృతి చెందారని నిర్ధారించారు. తరలివచ్చిన నేతలు... కేఎన్నార్ మృతి విషయాన్ని తెలుసుకుని మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, ఆర్డీవో పి.సాయిబాబు, జెడ్పీ సీఈవో పి.సుబ్బారావు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణ, సింహాద్రి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, యాసం చిట్టిబాబు, మాదివాడ రాము, నందమూరు శ్రీనివాస్ రత్నాకర్, షేక్ సలార్‌దాదా, బొర్రా విఠల్, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, మేకల కుమార్‌బాబులతో పాటు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధువులు, మిత్రులు, పార్టీ శ్రేణుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ మార్మోగింది. అమ్మ ఒడి నుంచి.. అంతర్జాతీయ స్థాయికి.. అమ్మ ఒడిలో పంచుకున్న అప్యాయతలను మరిచిపోకుండా కేఎన్నార్ అందరితోను అదే అప్యాయతానురాగాలతో మెలిగేవారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన స్వశక్తితో ఎదిగి వ్యాపారవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన కుక్కల నాగేశ్వరరావు కుటుంబానికి రాజకీయాలతో అనుబంధం ఉంది. కేఎన్నార్ తల్లి కె.అమ్మగారు కోసూరు సర్పంచ్‌గా విశేష సేవలందించారు. ఎస్కే షిప్పింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం ఓడరేవులో సరకులు దిగుమతి చేసుకునే కాంట్రాక్టు పనులను చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు. మనదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు చెన్నై తదితర దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. 2004లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా మెలిగిన ఆయన 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపుతో కాంగ్రెస్‌లో చేరారు. అటు తరువాత మొవ్వ జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఆయన పదవీకాలంలో 49 మండలాలు ఉన్న జిల్లాలో ఒక్కొక్క మండలంలో రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. 2006 జూలై 23 నుంచి 2011 జూలై 22 వరకు ఆయన జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఆయన హయాంలోనే జిల్లా పరిషత్‌కు ఐఎస్వో-9001-2000 అవార్డు దక్కింది. ఆయన హయాంలోనే జిల్లా పరిషత్ ఆవరణలో వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోకపోవటంతో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుచూపారు. వైఎస్ మాదిరిగా పరిపాలన చేయాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని భావించిన కేఎన్నార్ 2012 సెప్టెంబర్ 13న పామర్రులో జరిగిన సభలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎక్కడైనా రెడీ... వ్యాపార, రాజకీయ రంగాల్లో నిత్యం బిజీగా ఉండే కేఎన్నార్ ఒంగోలు గిత్తల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఒంగోలు గిత్తల పోటీలు, అందాల ప్రదర్శనలు జరిగితే చాలు అక్కడ తన గిత్తలతో ఆయన పోటీకి రెడీ. సుమారు 25 ఏళ్లుగా ఒంగోలు జాతి పశుపోషణను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనసాగించిన ఆయన తన గిత్తలను పోటీకి దించితే విజయం దక్కాల్సిందే. ఆయన ఒంగోలు ఎద్దు దేశస్థాయి చాంపియన్‌గా నిలిచి ‘ద్రోణాచార్య కోడె’గా అవార్డు పొందింది. అది రెండేళ్ల క్రితం చనిపోయింది. మహానందిలో ఏటా నిర్వహించే భారీ పోటీల్లో గత ఏడాది అత్యధిక ప్రైజ్‌మనీ, బహుమతి సాధించిన రికార్డును ఆయన ఎడ్లు దక్కించుకున్నాయి. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్‌రెడ్డి చేతులమీదుగా ఉత్తమ గోసంరక్షక అవార్డును అందుకున్నారు. బెస్ట్ సోషల్ వర్కర్‌గా శాసనమండలి చైర్మన్ చక్రపాణి నుంచి ఇందిరా ప్రియదర్శిని అవార్డును స్వీకరించారు. పాలకుల తప్పిదాల వల్లే ఒంగోలు జాతిని కాపాడుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. ఎంతో విశిష్టత, ప్రత్యేకత కలిగిన ఒంగోలు జాతి పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుండేవారు. రాష్ట్ర ఒంగోలు జాతి పశుపోషక పెంపకందారుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన ఒంగోలుజాతి ఎద్దుల పోటీల్లో తన ఎద్దులను బరిలో దించటమే కాక గిత్తల అందాల ప్రదర్శన, బండలాగుడు, సవారీ పందాల్లోనూ ముందుండేవారు. ఒంగోలు గిత్తల పోటీలు, సంరక్షణకు దివంగత వైఎస్ ఎంతో కృషి చేశారని ఎప్పుడూ గర్వంగా చెప్పే కేఎన్నార్ మృతి ఒంగోలు జాతి సంరక్షణకు తీరనిలోటని చెప్పకతప్పదు. ప్రతిమాటకు ముగింపు గా ఇకపోతే.. అనే ఊతపదాన్ని వాడే ఆయన ఇకలేరని తెలిసిన వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం కోసూరులోని కేఎన్నార్ వ్యవసాయ భూమిలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. అంత్యక్రియలకు ప్రముఖుల రాక కలెక్టరేట్ : కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ లాం తాంతియా కుమారి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు శుక్రవారం ఉదయం కేఎన్నార్ స్వగ్రామమైన కోసూరు చేరుకుని కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొంటారు.