కేఎన్నార్‌కు కన్నీటి వీడ్కోలు
=జగన్ సహా పలువురు నేతల నివాళులు
=జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు
=అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కోసూరు (కూచిపూడి), న్యూస్‌లైన్ : రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అజాతశత్రువుగా పేరుతెచ్చుకున్న జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావుకు ప్రజలు, నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు. కృష్ణాజిల్లా పరిషత్‌కు దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన కేఎన్నార్‌ను కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, అధికారులు పెద్ద ఎత్తున కోసూరుకు తరలివచ్చారు. పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న కేఎన్నార్ భౌతికకాయాన్ని కడసారి దర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. ఒంగోలు గిత్తల పశుపోషకుడిగా, ద్రోణాచార్య అవార్డు అందుకున్న కుక్కల నాగేశ్వరరావును చివరిచూపు చూసేందుకు గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పలువురు నాయకులు, రైతులు, తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
నాయకుల ఘన నివాళులు...
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేఎన్నార్‌కు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. పామర్రు నుంచి నిమ్మకూరు, అవురుపూడి, పాలంకిపాడు మీదుగా కోసూరు చేరుకున్న ఆయన కేఎన్నార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం కేఎన్నార్ భార్య కృష్ణకుమారి, పెద్ద కుమారుడు వెంకటరామ విద్యాసాగర్, చిన్న కుమారుడు మోహనకుమార్, కుమార్తె డొక్కు సీతాదేవి, అల్లుడు కాశీవిశ్వనాథ్, మేనమామ డొక్కు రామశాస్త్రులును పరామర్శించి ఓదార్చారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు రఘువీరారెడ్డి, కొలుసు పార్థసారథి, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ (పెందుర్తి), డీవై దాస్ (పామర్రు), అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, సమాచార చట్టం కమిషనర్ తాంతియాకుమారి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మహిళా కన్వీనర్ తాతినేని పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్, జలీల్‌ఖాన్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, బూరగడ్డ వేదవ్యాస్, జంగా కృష్ణకుమారి, నాగుల్‌మీరా, మాజీ ఎంపీ కేపీ రెడ్డియ్య, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్ కూచిపూడి విజయమ్మ, రాష్ట్ర గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ కూచిపూడి సాంబశివరావు, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, వైఎస్సార్ సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, తాడి శకుంతల, గౌతంరెడ్డి, పడమట సురేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్, టీడీపీ అధికార ప్రతినిధి యనమల రామకృష్ణుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), బందరు మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ మండవ జానకిరామయ్య, సన్‌ఫ్లవర్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ ఎండీవీఎస్‌ఆర్ పున్నంరాజు, కొలనుకొండ శివాజీ, దేవినేని అవినాష్, వినియోగదారుల సంఘం చైర్మన్ సైకం భాస్కరరావు తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.
శ్రీకాకుళంలో అంత్యక్రియలు...
కేఎన్నార్ భౌతికకాయాన్ని తొలుత ఆయన స్వగృహం నుంచి ఒంగోలు గిత్తలను సంరక్షించే పశువులకొట్టం వద్దకు తీసుకువెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచారు. అనంతరం గ్రామం చివరివరకు మోసుకువెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో మొవ్వ మీదుగా ఘంటసాల మండలం శ్రీకాకుళం కృష్ణానది ఒడ్డున అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు.