అజాతశత్రువు ఇకలేరు | K. Nageshwara Rao | Sakshi
Sakshi News home page

అజాతశత్రువు ఇకలేరు

Published Fri, Nov 22 2013 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

K. Nageshwara Rao

=రైతు, వ్యాపారవేత్త, రాజకీయవేత్తగా బహుముఖ సేవలు
 =హాయ్.. అంటూ పలకరించే  ఆత్మీయుడు ఇక సెలవంటూ..
 =సామాన్యుడి నుంచి అమాత్యుడి వరకు దిగ్భ్రాంతి
 =నేడు కేఎన్నార్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

 
నిండైన విగ్రహం.. నుదుట తిలకం.. గంభీరమైన వ్యక్తిత్వం.. నిష్కల్మష మనస్తత్వం.. చెదరని చిరునవ్వు ఆయనకు ఆభరణం.. అన్నా.. తమ్ముడూ.. అమ్మా.. చెల్లీ.. అంటూ ఆప్యాయపు పిలుపు.. కలుపుగోలుతనం.. ఆయన సొంతం.. అందుకేనేమో ఆయన అజాతశత్రువుగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు.. ఆయనే జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్). ఆయన పంచె కడితే రైతు.. సూటు వేస్తే వ్యాపారవేత్త.. ఖద్దరు చొక్కా, ప్యాంటు ధరిస్తే రాజకీయవేత్త.. ఇలా ఒకే జీవితంలో ఇన్ని రంగాల్లో రాణించి విశేష సేవలు అందించిన ఘనకీర్తి ఆయనది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించిన కేఎన్నార్ జిల్లాకు అందించిన బహుముఖ సేవలు విశేషం. అలాంటి అజాతశత్రువు ఇకలేరన్న సంగతి తెలుసుకున్న జిల్లా వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిద్ర నుంచే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, బంధువులు, ఆత్మీయులు, మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
సాక్షి, మచిలీపట్నం : రైతు కుటుంబానికి చెందిన కేఎన్నార్ (57) వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసుకునేలా జెడ్పీ చైర్మన్ పదవిని నిర్వర్తించారు. జిల్లా వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్న ఆయన రాజకీయంగా మరింత రాణిస్తారని అనుకుంటున్న తరుణంలో హఠాన్మరణం చెందారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా పాల్గొన్నారు.

బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల సదస్సులోనూ పాల్గొని ‘పంచాయతీ నిధులు-విధులు’ అంశంపై దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం మొవ్వ మండలంలోని తన స్వగ్రామం కోసూరు వచ్చిన ఆయన అక్కడ భోజనం చేసి మచిలీపట్నంలోని మాచవరంలో ఉన్న తన కార్యాలయానికి వచ్చి రాత్రి ఒంటి గంట వరకు కంప్యూటర్‌లో తన మెయిల్స్ చెక్ చేసుకుని అనంతరం నిద్రపోయారు.

ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, షేవింగ్ చేసుకుని నలతగా ఉందని మళ్లీ పడుకున్నారు. గంట వరకు తనను ఎవరూ లేపవద్దని కార్యాలయ సిబ్బందికి చెప్పారు. ఉదయం 9.30 గంటల సమయంలో కార్యాలయ సహాయకుడు సుఖేష్ వెళ్లి ‘సార్ టిఫిన్ తెమ్మంటారా’ అని అడిగాడు. ‘వద్దు.. కాసేపు పడుకుంటా’ అని చెప్పిన కేఎన్నార్  నిద్రపోయారు. సుమారు 10.30 గంటల సమయంలో పార్టీ పెడన కో ఆర్డినేటర్ ఉప్పాల రాంప్రసాద్ అక్కడికి రావడంతో కేఎన్నార్‌ను నిద్రలేపేందుకు కార్యాలయ సిబ్బంది వెళ్లారు.

బెడ్‌రూంలో మంచానికి, బాత్‌రూంకు మధ్య అపస్మారక స్థితిలో కేఎన్నార్ పడి ఉండటాన్ని గమనించి వెంటనే వైద్యుడిని తీసుకొచ్చారు. అప్పటికే శరీరం చల్లబడి, పల్స్ కొట్టుకోవడం తగ్గిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా ప్రభుత్వాస్పపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రకాశరావు, డాక్టర్లు రంగరాజన్, వీరంకి రామ్మోహన్, అల్లాడి శ్రీనివాస్, వినయ్‌కుమార్‌లు పరీక్షలు చేసి కేఎన్నార్ గుండెపోటుతో మృతి చెందారని నిర్ధారించారు.
 
తరలివచ్చిన నేతలు...

 కేఎన్నార్ మృతి విషయాన్ని తెలుసుకుని మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, ఆర్డీవో పి.సాయిబాబు, జెడ్పీ సీఈవో పి.సుబ్బారావు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణ, సింహాద్రి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, యాసం చిట్టిబాబు, మాదివాడ రాము, నందమూరు శ్రీనివాస్ రత్నాకర్, షేక్ సలార్‌దాదా, బొర్రా విఠల్, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, మేకల కుమార్‌బాబులతో పాటు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధువులు, మిత్రులు, పార్టీ శ్రేణుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ మార్మోగింది.
 
అమ్మ ఒడి నుంచి.. అంతర్జాతీయ స్థాయికి..

అమ్మ ఒడిలో పంచుకున్న అప్యాయతలను మరిచిపోకుండా కేఎన్నార్ అందరితోను అదే అప్యాయతానురాగాలతో మెలిగేవారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన స్వశక్తితో ఎదిగి వ్యాపారవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన కుక్కల నాగేశ్వరరావు కుటుంబానికి రాజకీయాలతో అనుబంధం ఉంది. కేఎన్నార్ తల్లి కె.అమ్మగారు కోసూరు సర్పంచ్‌గా విశేష సేవలందించారు. ఎస్కే షిప్పింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం ఓడరేవులో సరకులు దిగుమతి చేసుకునే కాంట్రాక్టు పనులను చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు.

మనదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు చెన్నై తదితర దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. 2004లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా మెలిగిన ఆయన 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపుతో కాంగ్రెస్‌లో చేరారు. అటు తరువాత మొవ్వ జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఆయన పదవీకాలంలో 49 మండలాలు ఉన్న జిల్లాలో ఒక్కొక్క మండలంలో రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు.

2006 జూలై 23 నుంచి 2011 జూలై 22 వరకు ఆయన జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఆయన హయాంలోనే జిల్లా పరిషత్‌కు ఐఎస్‌వో-9001-2000 అవార్డు దక్కింది. ఆయన హయాంలోనే జిల్లా పరిషత్ ఆవరణలో వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోకపోవటంతో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుచూపారు. వైఎస్ మాదిరిగా పరిపాలన చేయాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని భావించిన కేఎన్నార్ 2012 సెప్టెంబర్ 13న పామర్రులో జరిగిన సభలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
 
ఎక్కడైనా రెడీ...


వ్యాపార, రాజకీయ రంగాల్లో నిత్యం బిజీగా ఉండే కేఎన్నార్ ఒంగోలు గిత్తల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఒంగోలు గిత్తల పోటీలు, అందాల ప్రదర్శనలు జరిగితే చాలు అక్కడ తన గిత్తలతో ఆయన పోటీకి రెడీ. సుమారు 25 ఏళ్లుగా ఒంగోలు జాతి పశుపోషణను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనసాగించిన ఆయన తన గిత్తలను పోటీకి దించితే విజయం దక్కాల్సిందే. ఆయన ఒంగోలు ఎద్దు దేశస్థాయి చాంపియన్‌గా నిలిచి ‘ద్రోణాచార్య కోడె’గా అవార్డు పొందింది.

అది రెండేళ్ల క్రితం చనిపోయింది. మహానందిలో ఏటా నిర్వహించే భారీ పోటీల్లో గత ఏడాది అత్యధిక ప్రైజ్‌మనీ, బహుమతి సాధించిన రికార్డును ఆయన ఎడ్లు దక్కించుకున్నాయి. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్‌రెడ్డి చేతులమీదుగా ఉత్తమ గోసంరక్షక అవార్డును అందుకున్నారు. బెస్ట్ సోషల్ వర్కర్‌గా శాసనమండలి చైర్మన్ చక్రపాణి నుంచి ఇందిరా ప్రియదర్శిని అవార్డును స్వీకరించారు. పాలకుల తప్పిదాల వల్లే ఒంగోలు జాతిని కాపాడుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. ఎంతో విశిష్టత, ప్రత్యేకత కలిగిన ఒంగోలు జాతి పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుండేవారు.

రాష్ట్ర ఒంగోలు జాతి పశుపోషక పెంపకందారుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన ఒంగోలుజాతి ఎద్దుల పోటీల్లో తన ఎద్దులను బరిలో దించటమే కాక గిత్తల అందాల ప్రదర్శన, బండలాగుడు, సవారీ పందాల్లోనూ ముందుండేవారు. ఒంగోలు గిత్తల పోటీలు, సంరక్షణకు దివంగత వైఎస్ ఎంతో కృషి చేశారని ఎప్పుడూ గర్వంగా చెప్పే కేఎన్నార్ మృతి ఒంగోలు జాతి సంరక్షణకు తీరనిలోటని చెప్పకతప్పదు. ప్రతిమాటకు ముగింపు గా ఇకపోతే.. అనే ఊతపదాన్ని వాడే ఆయన ఇకలేరని తెలిసిన వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం కోసూరులోని కేఎన్నార్ వ్యవసాయ భూమిలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.
 
 అంత్యక్రియలకు ప్రముఖుల రాక


 కలెక్టరేట్ : కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ లాం తాంతియా కుమారి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు శుక్రవారం ఉదయం కేఎన్నార్ స్వగ్రామమైన కోసూరు చేరుకుని కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement