న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై గత రెండేళ్లుగా క్రిమినల్ కేసులు భారీగా పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి సిట్టింగ్, మాజీ ప్రజా ప్రతినిధులపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం 4,859కు చేరుకున్నట్లు వివరించింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ రెండేళ్లుగా వేగవంతమైనప్పటికీ పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు విజయ్ హన్సారియా, స్నేహ కలిట సోమవారం సుప్రీంకోర్టు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ‘హైకోర్టులు సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించాలి.
ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ సెషన్స్, మెజిస్టీరియల్ స్థాయి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కొన్ని హైకోర్టులు కోరుతున్నాయి. ప్రతి కోర్టుకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా హైకోర్టులు లేఖలు కూడా రాశాయి. సాక్షులకు రక్షణ, భద్రత కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్ల కల్పనలో నిధుల కొరత సమస్యగా మారిందని హైకోర్టులు చెప్పాయి’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే పనిచేస్తున్న బెంగళూరు, అలహాబాద్ ప్రత్యేక కోర్టుల్లో విచారణ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, ఇలాంటి చోట్ల అదనంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment