Kukkunuru
-
కుక్కునూరులో పీపీఏ బృందం పర్యటన
కుక్కునూరు: పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ అధికారుల బృందం బుధవారం పర్యటించింది. దాచారం పునరావాస కాలనీలను పరిశీలించిన బృందం కిష్టారం, మర్రిపాడు, ఉప్పేరు తదితర గ్రామాల్లోని నిర్వాసితులను కలిసి వారి అభిప్రాయాలు సేకరించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 కాంటూరు, 43, 45.7 కాంటూరు పరిధిలో ఏయే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి? 45.7 కాంటూరు కంటే ఎత్తులో ఉన్న గ్రామాలను ముంపు పరిధిలో ఎందుకు సేకరించారు? అనే విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల చుట్టూ నీరు చేరుతోందని, గ్రామాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండదని, అందుకే ఆర్అండ్ఆర్ పరిహారంలో చేర్చారని, నిర్వాసితులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల వచ్చిన వరదకు ముంపులో లేని గ్రామాలకు ఎంత వరకు తాకిడికి గురయ్యాయనే విషయాన్ని గ్రామస్తులు అధికారులకు చూపించారు. ఈ సందర్భంగా ముంపులో సేకరించిన గ్రామాల పక్కనే నిర్వాసిత కాలనీలు నిర్మిస్తున్నారని, రోడ్డుమార్గం ముంపులో ఉన్నప్పుడు నిర్వాసిత కాలనీలకు ఎలా వెళతారనే విషయంపై అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిర్వాసితులను అడగ్గా అడవి మార్గం గుండా మరో రహదారి ఏర్పాటు చేస్తారని అప్పటి భూ సేకరణ అధికారి చెప్పినట్లు వారు వివరించారు. -
16న కుక్కునూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి
వేలేరుపాడు : పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఈనెల 16న కుక్కునూరులో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు రాష్ట్ర సీపీఐ కౌన్సిల్ సభ్యుడు ఎండీ మునీర్ తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పిట్టా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడంలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి అన్ని గ్రామాల నిర్వాసితులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. 16న జరిగే సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. వేలేరుపాడు మండలంలో 9 గ్రామ పంచాయతీలను యూనిట్‌గా తీసుకుని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని, ఆయా గ్రామాల్లో గిరిజన, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న అన్నిరకాల భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సన్నేపల్లి సాయిబాబా, ఏఐటీయూసీ కార్యదర్శి కారం దారయ్య, గోలి వెంకన్నబాబు, బాడిశ రాము, ఇందిర, కుమారి పాల్గొన్నారు. -
విలీనమైనా విలువేది!
ఏలూరు (మెట్రో) : ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై.. మన జిల్లాలో అంతర్భాగమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఆ రెండు మండలాల అభివృద్ధిని ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం ఆ మండలాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉంటున్న సుమారు 30వేల మంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు గతంలో ఖమ్మం జిల్లా అధికారులు ప్రతి మండలంలో రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు. కుక్కునూరు, అమరవరం, వేలేరుపాడు, కొయిదా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఆయా మండలాల పరిధిలోని ప్రజలకు వైద్యసేవలు అందించే ఏర్పాటు చేశారు. ఆ రెండు మండలాలు జిల్లాలో విలీనం అయ్యాక అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెనుకాడుతున్నారు. ఎందుకీ వివక్ష! పూర్వ జిల్లాలోని 46 మండలాల్లో 175 పీహెచ్‌సీలతోపాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మరో 4 పీహెచ్‌సీలు కలిపి మొత్తం 179 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఏటా రూ.1.75 లక్షల చొప్పున ఆస్పత్రి అభివృద్ధి నిధులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కేటాయిస్తుంది. ఇందులో రూ.లక్షను ఆస్పత్రి అభివృద్ధికి, రూ.50 వేలను ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు, రూ.25 వేలను పారిశుధ్యం మెరుగుదలకు ఉపయోగించాల్సి ఉంటుంది. పూర్వ జిల్లాలోని 175 పీహెచ్‌సీలకు ఈ మొత్తాలను కేటాయించినా.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. -
పార్టీ మారే ఉద్దేశం లేదు..అవన్నీ పుకార్లు
ఖమ్మం : తాను పార్టీ మారటం లేదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి తనను ఎమ్మెల్యేను చేశారని, వారిని ఎన్నటికీ మోసగించనని ఆయన అన్నారు. బీఫాం ఇచ్చిన పార్టీని, వెన్నుదన్నుగా ప్రోత్సహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానాన్ని ఏ పార్టీకి తాకట్టు పెట్టే ప్రసక్తే లేదన్నారు. 'తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నారు' అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కొన్ని మీడియా సంస్థల్లో ఇలాంటి వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనపై ఈనెల 18న కుక్కునూరులో టీడీపీ నాయకుల దాడిపై సీఎం కేసీఆర్‌కు వివరించానని, ఆయన స్పందించి పోలీస్ అధికారులతో మాట్లాడారని, రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలకు తానే ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు. -
ముంపు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన
కుక్కునూరు: గోదావరి వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి వరద ప్రభావిత గ్రామాలను సందర్శించారు. వరదల వల్ల దెబ్బతిన్న పాలవాగు చప్టా, వింజరం గ్రామంలో పొలాలకు వెళ్లే దారిపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు. వరద బాధితులను ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాలకు అందించే పరిహారం, నిర్వాసితుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం వరదల వల్ల దెబ్బతిన్న కుక్కునూరులోని రామసింగారం సెంటర్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే రోడ్డు, దాచారానికి వెళ్లే దారిలో గుండేటివాగుపై లోలెవెల్ చప్టాను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఆంధ్రలో కలిసిన ముంపు మండలాలల్లో వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వరద బాధితులకు న్యాయం జరిగేంత వరకూ జగన్మోహన్రెడ్డి ఆంధ్ర ప్రభుత్వంతో పోరాడతారని తెలిపారు. ఎకరానికి రూ. 25 వేలు అందించాలి : వేలేరుపాడు మండలంలోని తాట్కూరుగొమ్ము, తిర్లాపురం, రుద్రంకోట గ్రామాల్లో వరదల వల్ల దెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి పంటలను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంపీ పొంగులేటి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వరరావు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల కన్వీనర్లు కుచ్చర్లపాటి నరసింహరాజు, కేసగాని శ్రీనివాసగౌడ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, సర్పంచ్‌లు వర్సా లక్ష్మి, సోడె బుల్లెమ్మ, ఊకే రాధ, పొడియం వెంకటరమణ, జగిడి బాలరాజు, నాయకులు మన్యం సత్యనారాయణ, వెంక్నబాబు, రాజారావు, చిన రసింహరాజు,సూర్యనారాయణరాజు, రాజేశ్, వినోద్, రవి, రామారావు, మధు, శ్రీను, రామకృష్ణ, తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి వీఆర్‌పురం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ముంపు మండలాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి ఎంపీ ఆదివారం పర్యటించారు. వేలేరుపాడు మండలంలో పర్యటన ముగించుకున్న అనంతరం లాంచీపై వీఆర్‌పురం మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి చేరుకున్నారు. ఇటీవల వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం వారితో మాట్లాడుతూ ముంపు గురైయ్యే ప్రతి కుటుంబానికీ అత్యున్నతమైన ప్యాకేజీ అందేలా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొం దించిందని విమర్శించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ముంపు ప్రాంత సమస్యలపై నివేదికను రూపొందించి ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఇవ్వనున్నామని చెప్పారు. అనంతరం శ్రీరామగిరి, సీతపేట గ్రామాల్లోని వరదల ప్రభావానికి దెబ్బతిన్న మిర్చి, వరి చేలను పరిశీలించారు. అప్పులు చేసి వ్యవసాయం చేసుకునే చిన్న సన్నకారు రైతులను వరద కోలుకోలేని దెబ్బతీసిందని అన్నారు. వరదలతో దెబ్బతిన్న మిర్చికి ఎకరాకు రూ.35 వేలు, వరికి ఎకరాాకు రూ. 25 వేలు నష్టపరిహారం ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేలా పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ డివిజన్ నాయకుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కడియం రామాచారి, మంత్రిప్రగడ నరసింహరావు, మండల నాయకులు పొడియం గోపాల్, ముత్యాల శ్రీనివాస్, మాచర్ల గంగులు, బంధ విజయలక్ష్మి, రేవు బాలరాజు, కోలా బాబురావు తదితరులు పాల్గొన్నారు.