నేటితో ప్రచారానికి తెర
సాక్షి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి నేటి (సోమవారం) సాయంత్రం ఐదు గంటలకు తెరపడనుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రచార వేగాన్ని పెంచడంతో పాటు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడైన కుమారస్వామి, (బెంగళూరు గ్రామీణ), చలువరాయస్వామి (మండ్య) లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే.
దీంతో ఎలాగైనా విజయం సాధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అమాత్యులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే తమ కార్యాలయాలకు రావడమే మానేసి పార్టీ అభ్యర్థులైన సురేష్‌కుమార్, రమ్య గెలుపు కోసం లోక్‌సభ పరిధిలోని నియోజక వర్గాల్లో తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రమ్య గెలుపు కోసం కేపీసీసీ నాయకులు మండ్య లోక్‌సభ పరిధిలో కేంద్ర మంత్రులు వీరప్పమొయిలీ, మునియప్ప తదితర నాయకులతో బహిరంగ సభల్లో మాట్లాడించి
ఆ వర్గం ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టన్, ఎంపీ మహ్మద్అజారుద్దీన్ను కూడా ప్రచారంలోకి దించారు. ఇక బెంగళూరు గ్రామీణ స్థానానికి పోటీపడుతున్న సురేష్‌కుమార్ కోసం స్వయానా అతని అన్న, కనకపుర ఎమ్మెల్యే డీ.కే శివకుమార్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందులో భాగంగా తన రాజకీయ బద్ధశత్రువు, ఎస్పీ పార్టీ ఎమ్మెల్యే యోగీశ్వర్ మద్దతు కూడా అడగడానికి వెనుకాడలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో కూడా గెలుపు కోసం అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తోంది. అయితే ృగహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్, మాజీ కేంద్ర మంత్రి ఎస్.ఎంృకష్ణ మధ్య ఉన్న విభేదాలు మండ్య స్థానానికి పోటీపడుతున్న రమ్య విజయావకాశాలు దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల భావన.
జేడీఎస్‌తో బీజేపీ దోస్తీ...
మొదటి నుంచి ఈ రెండు స్థానాల్లో జేడీఎస్‌కు మంచి పట్టు ఉంది. దీంతో ఎలాగైనా అనితాకుమారస్వామి (బెంగళూరు గ్రామీణ), సీ.ఎస్ సిద్ధరాజు (మండ్య)లను గెలుచుకోవాలని ఆ పార్టీ నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన దేవెగౌడ ఈ విషయంలో పట్టినపట్టు విడవడం లేదు. వర్షాలను, చలిగాలులను కూడా లెక్కచేయకుండా 80 ఏళ్ల వయసులో కూడా బహిరంగ ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసంృకషి చేస్తున్నారు. ఇక కుమారస్వామి అయితే ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ పార్టీతో పాటు ఒకప్పటి తన రాజకీయ సన్నిహితుడు, ప్రస్తుత సీఎం అయిన సిద్ధరామయ్యపై విమర్శలను గుప్పిస్తున్నారు. తమకు బీజేపీతో లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎటువంటి పొత్తు ఉండదని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన జేడీఎస్ నాయకులు ఆఖరి క్షణాల్లో ఆ పార్టీనాయకులతో కలిసి బహిరంగ ప్రచారానికి సిద్ధమయ్యారు.
అందులో భాగంగా బెంగళూరు గ్రామీణ పార్లమెంట్ స్థానానికి పోటీపడుతున్న అనితా కుమారస్వామితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఆర్. అశోక్ ఆదివారం బహిరంగ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కువ మెజారిటీతో జేడీఎస్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. నేడు (సోమవారం) కూడా బీజేపీకి చెందిన కొంతమంది అగ్రనాయకులు జేడీఎస్ అభ్యర్థుల పరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే లౌకికవాద పార్టీగా చెప్పుకునే జేడీఎస్ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం హిందుత్వ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీతో జతకట్టడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ రెండు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు 21న జరగనుండగా ఫలితాలు 24న వెలువడనున్నాయి.
ఆకట్టుకున్న కరాటే పోటీలు
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : నగరంలోని అల్లం భవనంలో పంచాక్షరీ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కరాటే పోటీలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 150 మంది బాలికలు పాల్గొనడం విశేషం. తొలిరోజు బె ల్ట్ ప్రదర్శనలు జరగ్గా, రెండవ రోజు ఆదివారం ఫైటింగ్ ప్రదర్శనలు జరిగాయి. బె ల్ట్ ప్రదర్శనలో కలర్ బెల్ట్‌లో గదగ్‌కు చెందిన చేతన మొదటి స్థానం, హుబ్లీ గోజరియాకు ద్వితీయ స్థానం, బెంగళూరు సోరిన్ రాం తృతీయ స్థానం పొందారు.