22 ఏళ్ల తర్వాత ఆలయంలో కుంభాభిషేకం
కేకేనగర్ : అరియలూర్‌లో 22 సంవత్సరాల తర్వాత కోదండరామస్వామి పెరుమాల్ ఆలయంలో బుధవారం కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ అభిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. అరియలూర్ పెరుమాళ్ కోవిల్ వీధిలో 380 సంవత్సరాల ఘన చరిత్ర గల పురాతన ప్రసిద్ధి చెందిన కోదండ రామస్వామి పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో 1995వ సంవత్సరంలో కుంభాభిషేకం జరిగింది. అనంతరం 22 సంవత్సరాల తర్వాత మహా కుంభాభిషేకం బుధవారం జరిగింది. ఈ ఆలయంలో కోదండరామస్వామి సన్నిధి, అమ్మన్ సన్నిధి, అయ్యప్పన్, గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి వార్ల సన్నిధులు ఉన్నాయి.
ఆలయ జీర్ణోద్ధరణ పనులు ముగిసిన నేపథ్యంలో ఆలయ కుంభాభిషేకం బుధవారం ఉదయం 6 గంటలకు జరిగింది. వేదపండితులు వేద మంత్రాల నడుమ కలశాలపై పుణ్య జలాలు పోసి అభిషేకం చేశారు. ఆ సమయంలో భక్తులు గోవిందా.. గోవిందా అనే భక్తి నినాదాలు అంబరాన్ని అంటాయి. అనంతరం పుణ్య జలాలను భక్తులపై చల్లారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ పెరుమాల్ స్వామి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రధంలో కొలువుదీరి నడు అగ్రహారం, మేల్ అగ్రహారం, పొన్ను స్వామి, అరన్మలై వీధి, కైలాశనాధర్ ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు చల్లని దీవెనలు అందించారు. అడుగడుగునా స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.