kundirpi
-
నీటికోసం రాస్తారోకో
కుందుర్పి : తాగునీటి సమస్య పరిష్కారం కోసం మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన 200 మంది రోడ్డెక్కారు. పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం 7 గంటలకే గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరుకున్నారు. ప్రదాన కూడలిలలో ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆందోళన కొనసాగించడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ జేఈ నవీన్, ఎంపీడీఓ నాగరాజు తదితరులు గ్రామస్తులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. గ్రామస్తుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. -
ఉపాధి పనులకు వెళ్తే ఆగిన ఊపిరి
కుందుర్పి(కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం తూముకుంటలో చంద్రశేఖర్(38) అనే కూలీ ఉపాధి పనులు చేస్తుండగానే.. గుండెపోటుకు గురై ఊపిరి ఆగింది. రోజులాగే బుధవారం ఉదయం గ్రామ శివార్లలో జరుగుతున్న ఫారంపాండ్ తవ్వేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో కుప్పకూలిపోయాడని కూలీలు తెలిపారు. వెంటనే కుందుర్పి పీహెచ్సీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలొదిలినట్లు చెప్పారు. మృతుడికి భార్య పద్మజ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ, వెలుగు ఏపీఎం తిమ్మప్ప, ఏపీఓ నీరజ, తహసీల్దార్ రమేషన్ తూముకుంటకు చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉపాధి హామీ నుంచి రూ.50 వేలు, చంద్రన్న బీమా పథకం కింద మరో రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.5 వేలు అందించారు. -
వివాహిత ఆత్మహత్య
కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన వివాహిత నాగమణి (20) మహిళ కడుపునొప్పి తాళలేక ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి గంగాధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు నెలల క్రితం నాగమణికి వివాహమైంది. మూడు నెలలుగా కడుపునొప్పి ఉండేది. ఆదివారం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.