డిసెంబర్‌లోగా కుప్పంకు కృష్ణా నీరు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/ కుప్పం: డిసెంబర్‌లోగా కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం పనుల వేగాన్ని పెంచుతామన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు కమతమూరు, సామగుట్టపల్లి క్రాస్‌లలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా పశుదాణా భద్రత కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో రెండో విడత డ్వాక్రా రుణమాఫీ కోసం నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈసారి డ్వాక్రా మహిళలు మాఫీ సొమ్మును వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు.
తాగుడు వల్ల వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్న సీఎం చంద్రబాబు తాగుబోతులైన భర్తలకు తిండిపెట్టడం మానేస్తే గానీ దారికి రారని మహిళలకు సూచించారు. గ్రామాల్లో బెల్టుషాపులు కనిపిస్తే వాటిని ధ్వంసం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు తప్పు చేస్తే వారి ఉద్యోగం పోతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
హోదా కోసం పోరాడుతూనే ఉన్నా...
ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతూనే ఉన్నాన ని సీఎం పునరుద్ఘాటించారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తనను ఇబ్బంది పెట్టలేవన్నారు. తన హయాంలో బంద్‌లు, ధర్నాలను సహించబోనన్నారు. ఆందోళన కారులు ఆర్టీసీ బస్సుల జోలికెళ్తే చేతులు కాలేలా ప్రత్యేక చట్టం తేవాల్సి ఉందన్నారు. కాగా నియోజకవర్గ పర్యటనలో కుప్పంపై సీఎం మరోమారు హామీల జల్లు కురిపించారు. గతంలో ఇచ్చిన హామీల సంగతి ప్రస్తావించకుండానే కొత్త వాగ్దానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కమతమూరు, సామగుట్టపల్లి క్రాస్, శాంతిపురం మండలాల్లో రూ.2.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
గవర్నర్‌ను పుష్కరాలకు ఆహ్వానించిన సీఎం
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పుష్కర వేడుకలకు ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలిశారు. పుష్కరాల ఆరంభ, ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌక ర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ఏడాది పుష్కరాల సందర్భంగా మరిన్ని నదులను అనుసంధానం చేసి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని దీక్ష తీసుకోబోతున్నట్లు వివరించారు. అనంతరం పుష్కరాల్లో తప్పకుండా పాల్గొంటానని గవర్నర్ చెప్పారు. కాగా, వీరి భేటీలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని, అరుణ్‌జైట్లీలతో సమావేశం, ప్రత్యేక హోదాపై రాష్ర్టంలో జరిగిన ఆందోళనలు చర్చకు వచ్చినట్లు సమాచారం.