సిటీ రైల్వే స్టేషన్‌కు మహర్దశ
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు రానున్నాయి. స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా రూ.25కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడితే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. పనులను సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. 2018–19 బడ్జెట్ నుంచి ఇస్తున్న నిధులను ఏయే అవసరాలకు వినియోగించాలనే అంశాలతో కూడిన అంచనా విలువలను ఈనెల 10వ తేదీలోపు ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంది. దీంతో సివిల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాక్, టెక్నికల్ వంటి విభాగాలు కసరత్తు మొదలుపెట్టాయి.
నెరవేరనున్న దశాబ్దాల కల
కర్నూలు రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ హయాంలో నగరంలోని నర్సింహారెడ్డి నగర్, ఇందిరాగాంధీ నగర్ మధ్య నిర్మించారు. అప్పట్లో నగర జనాభా, స్థాయిని బట్టి ‘కర్నూలు టౌన్’గా పేరు ఖరారు చేశారు. రైల్వే బోర్డు నిర్ణయం ప్రకారం హాల్ట్, క్రాస్, టౌన్, సిటీ, క్లాస్–ఏ సిటీ పేర్లు పెడితే వాటికి తగ్గట్లుగా స్టేషన్లు అభివృద్ధి చేస్తారు. టౌన్ స్టేషన్ ఉన్న కారణంగా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండేది. 1995లో కర్నూలు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచారు. అప్పటి నుంచి స్టేషన్ స్థాయిని టౌన్ నుంచి సిటీగా మార్చాలని డిమాండ్ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించడంలో 2014లో కర్నూలు సిటీగా ఏర్పడింది. అయితే ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి.
సమస్యలు ఇవీ..
కర్నూలు స్టేషన్ సిటీ స్థాయికి అప్‌గ్రేడ్ అయినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ‘సిటీ’గా మారితే నిధులు వరదలా వస్తాయని భావించినా ఆశించిన ఫలితం లేకుండా పోయింది. ప్లాట్‌ఫాముల్లో కంపు, వెయిటింగ్ హాలు లేక మహిళా ప్రయాణికుల ఇబ్బందులు, తగిన కుర్చీలు లేక కిందే కూర్చుంటున్నారు. ఇరుకైన రోడ్డు, ఒకే అడ్వాన్స్ బుకింగ్ కౌంటరు, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి.
రోజుకు 10వేల మంది ప్రయాణాలు
కర్నూలు స్టేషన్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి, కొంగూ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ప్రతిరోజు 17 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 7 ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 10వేల మంది సాధారణ ప్యాసింజర్లు, 800 మందికి పైగా రిజర్వేషన్లతో రాకపోకలు సాగిస్తుండడంతో ఆశాఖకు రూ.10లక్షల వరకు రోజువారి ఆదాయం వస్తోంది. అయినా హాలులో ఫ్యాన్లు, లైట్లు కూడా లేకపోవడం గమనార్హం. 2, 3వ నంబరు ప్లాట్‌ఫాంలలో తాగునీటి సమస్య, ఫ్యాను సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.
జరిగే అభివృద్ధి పనులు
♦ కర్నూలు సిటీ స్టేషన్‌కు కేటాయించిన రూ.25కోట్లతో పలు రకాల పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వసతులు, సౌకర్యాలు మెరుగుపర్చి సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించారు.
♦ స్టేషన్ ముఖద్వారం రూపురేఖలు మార్చనున్నారు. రెండు ముఖద్వారాలు పెట్టే ఆలోచనలో అధికారులున్నారు.
♦ స్టేషన్ ఆధునికీకరణ, మల్టీ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, షాపింగ్, కమర్షియల్ షాపుల నిర్మాణాలు జరిగే అవకాశాలు.
♦ ఆహ్లాదకరమైన భవనాలు, పార్కు, అన్ని సౌకర్యాలతో విశాలమైన ప్లాట్‌ఫాంలు, అధికార యంత్రాంగానికి తగిన గదులు, సీసీ కెమెరాల నిఘా, పార్కింగ్, వైఫై, ఫౌంటైన్, వీఐపీ లాంజ్, రెస్టు రూమ్‌లు తదితర వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
♦ పట్టాలను క్లీనింగ్ చేసేందుకు వాటర్ ఆప్రాన్ మిషన్ ఏర్పాటు చేయనున్నారు.
♦ ప్యాసింజరు ఆపరేటింగ్ ఎంక్వైరీ టర్మినల్ (పీఓఈటీ) మిషన్లు అదనంగా ఏర్పాటు చేయనున్నారు.. ఈ మిషన్ ద్వారా మనకు కావాల్సిన భాషలో రైలు వివరాలు, కోచ్ పరిస్థితి, పీఎన్ఆర్ స్టేటస్‌తోపాటు రైలు ఏ స్టేషన్లో వస్తుందో, వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో కలర్ డిస్ప్లేలో చూసుకోవచ్చు.
♦ ప్రస్తుతం తిరిగే రైళ్లుతోపాటు అదనంగా నడపడం, నాన్ స్టాప్లకు స్టాపింగ్ కల్పిండం వంటివి సమకూరే అవకాశాలున్నాయి.