'కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం'
కర్నూలు: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 28న ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతుందని, సీఆర్పీఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బలగాలను బందోబస్తుకు ఏర్పాటు చేశామని చెప్పారు.
కౌంటింగ్ ప్రక్రియ అనంతరం సమస్యాత్మక ప్రాంతాలలో ఏ చిన్నపాటి ఇబ్బందులు తలెత్తకుండా పికెట్స్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సు ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక పూర్తి చేశామని ఎస్పీ తెలిపారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు, రాజకీయ పార్టీలు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కౌంటింగ్ బందోబస్తుకు ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సిఐలు, 38 మంది ఎస్సైలు, 74 మంది ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్ళు, 260 మంది కానిస్టేబుళ్ళు, 20 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 44 సెక్షన్ల ఎఆర్ సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ దళం, 5 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు ఏర్పాటు చేసి అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు పి.షేక్ షావలి, ఐ.వెంకటేష్ డీఎస్పీలు జె.బాబుప్రసాద్, డి.వి. రమణమూర్తి, సీఐలు శ్ములకన్న, కృష్ణయ్య, డేగల ప్రభాకర్, నాగారాజా రావు పాల్గొన్నారు.