kuruba
-
ముస్లింలకు టికెట్లు ఇవ్వం
సాక్షి, బెంగుళూర్: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమను నమ్మరని, అందుకే తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కాని మీకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మరు. మమ్మల్ని నమ్మండి.. అప్పుడు మీకు టికెట్లతోపాటు ఏది కావాలంటే అది ఇస్తాం’ అని కర్ణాటకలోని కొప్పల్లో కురుబా, ఇతర మైనారిటీవర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. వెనుకబడిన కురుబా సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. -
నేడు పరిగిలో కనకదాసు జయంతి
హిందూపురం రూరల్ : పెనుకొండ తాలూకా పరిధి పరిగి మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాస జయంతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. పరిగిలోని బీరలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బైక్ర్యాలీ, 9 గంటలకు మహిళలతో జ్యోతుల ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ముఖ్య అతిథులుగా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్నారాయణ, కురుబసంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం, రాయలసీమ కురుబసంఘం అధ్యక్షులు పీటీ నరసింహారెడ్డి, బోరంపల్లి ఆంజినేయులు, పెనుకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ హాజరవుతారని తెలిపారు. -
8న కురుబ వధూవరుల పరిచయ వేదిక
అనంతపురం రూరల్ : కురుబ వధూవరుల పరిచయ వేదికను ఈనెల 8న గుత్తిరోడ్డులోని కనకదాస కళ్యాణమంటపంలో నిర్వహిస్తున్నట్లు కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం తెలిపారు. మంగళవారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8న నిర్వహించే వధూవరుల పరిచయ వేదికకు వధూవరుల పాస్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. వేదికపైనే వధూవరుల వివరాలను సైతం వివరిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9866166777, 9440488444 నంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో కురుబ సంఘం నాయకులు పిడుగు క్రిష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.