కురుక్షేత్ర సభపై నిఘా
♦ ఎక్కడికక్కడే ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేసేందుకు సన్నద్ధం
♦ ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
♦ వివరాలు గోప్యంగా ఉంచుతున్న వైనం
♦ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు
ఏఎన్యూ పట్నంబజారు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నేడు తలపెట్టిన మాదిగ కురుక్షేత్ర మహాసభకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గుంటూరు నగరంతోపాటు అనేక ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారమే హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చిన జాతీయ కళాకారుల బృందానికి చెందిన ఆరుగురిని గుంటూరు నగరంలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంచినట్లు తెలిసింది. ఎమ్మార్పీఎస్ నేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), ఇంటిలిజెన్స్, కౌంటర్ ఇంటిలిజెన్స్, కిక్రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ) బృందాలను రంగంలో దింపినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి నుంచి సభా సమయం ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతలను నిలువరించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ నాయకులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
సభా ప్రాంగణం వద్ద పోలీసు బలగాలు
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏపీఎస్పీ బెటాలియన్, ఆర్మ్డ్ రిజర్వుడుతోపాటు ఆయా స్టేషన్లకు చెందిన అధికారులు, వెయ్యి మందికిపైగా పోలీసులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ప్రతి వ్యక్తీ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను గురువారం గుంటూరు రేంజ్ డీఐజీ కే.వీ.వీ.గోపాలరావు, అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయారావు, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు పర్యవేక్షించారు. రాత్రి సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పోలీసుల బలగాలకు యూనివర్సిటీతోపాటు, పరిసర ప్రాంతాల్లో వసతి కల్పించారు.