జయ నామ సంవత్సరంలో మరింత అభివృద్ధి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జయ నామ సంవత్సరంలో జిల్లాలో మరింత అభివృద్ధి జరగాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆకాంక్షించారు. నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం నగరాలు, పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. జయ నామ సంవత్సరం సందర్భంగా సోమవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కలెక ్టర్ ప్రసంగించారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని చెప్పారు. రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు అన్ని రంగాలకు చెందిన వారికి శుభం కలగాలని కోరారు. కార్యక్రమంలో ఏజేసీ ప్రకాష్‌కుమార్, డీఆర్ఓ జీ గంగాధర్‌గౌడ్, స్టెప్ సీఈఓ బీ రవి, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ కే పోలప్ప, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం జ్వాలానరసింహం పాల్గొన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ విజయకుమార్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ పురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తి పంచాం గాన్ని చదివి వినిపించారు. అక్షర సాహితీ సమితి అధ్యక్షుడు మాజేటి వెంకటసుబ్బయ్యశాస్త్రి ఉగాది పర్వదిన ప్రాశస్త్యాన్ని వివరించారు. ప్రకృతికి, పండుగలకు గల అనుబంధాన్ని గుర్తుచేశారు. విజయ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.