ఎల్ అండ్ టీ లాభం 19% అప్
క్యూ4లో రూ. 2,454 కోట్లు
* మొత్తం ఆదాయం రూ.33,157 కోట్లు...
న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 19 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.2,070 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,454 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. మౌలిక రంగ విభాగం అధికాదాయం ఆర్జించడంతో ఇది సాధ్యమైందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.28,023 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.33,157 కోట్లకు ఎగసింది. ప్రాజెక్టుల అమల్లో పురోగతిని సాధించడంతో ఆదాయం పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయంలో 54 శాతం వాటా మౌలికరంగ విభాగం నుంచే వచ్చింది.
నికర లాభం రూ.5,091 కోట్లు
ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.4,765 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధితో రూ.5,091 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.1,03,522కు చేరింది. అంతర్జాతీయ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.33,302 కోట్లకు ఎగసింది. దేశీయ మార్కెట్ పునరుజ్జీవన బాటలోనే ఉందని, ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో పారిశ్రామిక పెట్టుబడులు పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని సంస్థ పేర్కొంది.
‘‘పర్యావరణ, భూ సమీకరణ అనుమతులు పొందడంతో జాప్యం, ప్రాజెక్టులకు కావలసిన రుణాల సమీకరణలో సమస్యలు... కారణంగా ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. మౌలిక రంగం జోరు ప్రభుత్వ చర్యలపైననే ఆధారపడి ఉంది. దేశీయ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం కనక మధ్యకాలిక వ్యవధిలో చక్కని వృద్ధి సాధిస్తామన్న నమ్మకం మాకుంది’’ అని సంస్థ వివరించింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 4 శాతం లాభపడి రూ.1,291 వద్ద ముగిసింది.