కార్మికుల సమస్యపై అసెంబ్లీలో చర్చ
అఖిలపక్ష నేతల డిమాండ్
పేపరు మిల్లు కార్మికులకు అండగా ఉంటామని భరోసా
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
ఇంటర్నేషనల్ పేపరు మిల్లు కార్మికుల సమస్యను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు. తొలగించిన 33 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని, తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ పేపరు మిల్లు కార్మికులు 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేపరు మిల్లు ఎదురుగా ఉన్న కల్యాణ మండపంలో అఖిలపక్ష నాయకులు మంగళవారం సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ వారికి అఖిలపక్షం అండగా ఉంటుందని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంత శ్రీహరి, 31వ డివిజన్ ఇన్ఛార్జి మజ్జి అప్పారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, వామపక్ష నాయకులు టి.అరుణ్, మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, పేపరు మిల్లు కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు.
సీఎం కార్యాలయ దన్నుతోనే..
వివాదాన్ని పరిష్కరించే ఆలోచనలో మిల్లు యాజమాన్యం ఉన్నట్టు కనిపించడం లేదని నాయకులు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి అధికార పార్టీ జోక్యం అనివార్యమని స్పష్టం చేశారు. 13 రోజులుగా ఆందోళన చేస్తున్నా, మిల్లు యాజమాన్యం దిగిరాకపోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యాజమాన్యానికి అండదండలు ఉండడమే కారణమని చెప్పారు. కొంతమంది కార్మిక నేతలు యాజమాన్యానికి కోవర్టులుగా వ్యవహరించడం వల్ల పోరాటం బలహీనపడుతోందని తెలిపారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాల్సి వస్తోందని, దీని ప్రభావంపై కార్మిక సంఘాలు ఆలోచించుకోవాలని చెప్పారు. ఉద్యమంలో భాగంగా కార్మికులు తమ కుటుంబ సభ్యులతో మిల్లు ఎదుట ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అఖిలపక్షం తరఫున అన్ని పార్టీలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.