కార్మిక చట్టాల ప్రక్షాళన!
మూడు చట్టాలను ఏకీకృతం చేసే ప్రతిపాదన
* కార్మిక నియామక, తీసివేత నిబంధనలు సరళీకృతం
న్యూఢిల్లీ: దేశంలో కార్మిక చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కఠినంగా ఉన్న ఉద్యోగుల నియామకం, తీసివేత నిబంధనలను సరళీకృతం చేస్తోంది. సంఘాలను ఏర్పాటుచేసే నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
దేశంలో వ్యాపార కార్యకలాపాలు సులభంగా సాగేలా చేయడం, ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో మూడు చట్టాలను మిళితం చేసేందుకు కార్మిక శాఖ ముసాయిదా బిల్లును సిద్ధం చేసిందన్నారు. పారిశ్రామిక సత్సంబంధాల కోసం కార్మిక సంఘాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, పారిశ్రామిక ఉపాధి చట్టాలను ఏకీకృతం చేస్తామన్నారు. పరిశ్రమలకు, కార్మికులకు మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ముసాయిదా బిల్లు గురించి దత్తాత్రేయ ఇంకా ఏమన్నారంటే...
⇒ అధికారిక అనుమతి కోరకుండా కంపెనీ 300 మంది కార్మికులను నియమించుకునేందుకు ఈ ముసాయిదా అనుమతిస్తుంది.
⇒ ఉద్యోగులను తీసివేసేందుకు నెల రోజుల నోటీసు కాలాన్ని 3 నెలలకు పెంచుతాం.
⇒ సిబ్బందిని ఆకస్మికంగా తొలగించాలంటే గతంలో వారి సర్వీసుపూర్తయిన ఏడాది కాలానికి 15 రోజుల వేతనాన్ని ఇవ్వాల్సి ఉండగా, దీన్ని 45 రోజులకు పెంచుతాం.
⇒ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక సంప్రదింపులు జరుపుతాం.
⇒ ఉద్యోగులందరికీ కనీస వేతనాన్ని అమలుచేస్తాం.
⇒ సంఘాల ఏర్పాటుపై, సమ్మెలపై నిబంధనలు కఠినం చేస్తాం. ఆరు నెలల ముందస్తు నోటీసులేకుండా సమ్మెలకు అనుమతించం.
⇒ సిబ్బంది సామూహికంగా క్యాజువల్ సెల వు పెట్టినా,సగంకంటే ఎక్కువమంది క్యా జువల్ లీవ్‌పై వెళ్లినా సమ్మెగా పరిగణిస్తాం.
⇒ కార్మిక సంఘాల్లో బయటి వ్యక్తులను అనుమతించం. బయటివారెవరూ వ్యవస్థీకృత రంగంలోని సంఘాల్లో ఆఫీస్ బేరర్‌గా ఉండకుండా నిషేధిస్తాం. అవ్యవస్థీకృత రంగంలో మాత్రం బయటి వ్యక్తులు ఇద్దరు ప్రతినిధులుగా ఉండేందుకు వీలుకల్పిస్తాం.