Labour contractor
-
కూలీకి వచ్చి మోసపోయారు
పెద్దపల్లి: స్థానికంగా ఉపాధిలేకపోవడంతో పిల్లా, పాపలతో రాష్ట్రంకాని రాష్ట్రమొచ్చారు. పనికి తగ్గ కూలీ ఇస్తామని ఓ కాంట్రాక్టు మధ్యవర్తి చెప్పిన మాటలకు నమ్మివచ్చి ఇప్పుడు కడుపు మాడుతున్నారు. వీరి ధీనస్థితిని గమనించిన పెద్దపల్లిలోని బాబా రాందేవ్ ఆలయ నిర్వాహకులు చేరదీశారు. రెండురోజులుగా ఆకలితో అలమటించడంతో ఆలయ ఆవరణలో ఆశ్రయమిచ్చి, కడుపునిండా భోజనం పెట్టించారు. దుబాయ్ తరహామోసం.. తెలంగాణ కూలీలు దుబాయ్‌కు వెళ్లి అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఆకలితో అలమటించిన కథనాలు నిత్యం చూస్తుంటాం. అలాంటిదే పెద్దపల్లి జిల్లాలోనూ జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేటకు చెందిన మహ్మద్ మౌసామి మహారాష్ట్రలోని చంద్రాపూర్, కర్పోనట్ ప్రాంతాలకు చెందిన కూలీలను ఇక్కడికి తరలిస్తాడు. పెద్దపల్లి జిల్లాలోని పలు అభివృద్ధి పనుల నిర్మాణాల నిమిత్తం 20రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి 42మంది కూలీలను రప్పించాడు. మహిళలకు రూ.300 సహాయకులకు రూ.400, మేస్త్రీకి రూ.600 రోజువారీగా చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నాడు.అయితే పెద్దపల్లిలో మూడుచోట్ల ఇప్పటికీ 20 రోజులు పనులు చేయించుకుని కేవలం పదిరోజుల కూలీ డబ్బులు చెల్లించాడు. మరో రూ.1.50లక్షలు రావాల్సి ఉండగా కాంట్రాక్టరు నుంచి సదరు మధ్యవర్తి వారంరోజుల క్రితమే వసూలు చేసుకుని పరారయ్యాడు. దీంతో ఆ వలస కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రెండురోజులుగా పిల్లాపాపలతో 42మంది ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ధీన స్థితిని గమనించిన స్థానిక బాబా రాందేవ్ ఆలయ నిర్వాహకులను ఆశ్రయం కల్పించారు. వారిని చేరదీసి భోజనం అందించారు. అనంతరం స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజయ్య, ఎస్సై ఉపేందర్‌కు విషయం తెలియజేశారు. వారు అక్కడికి చేరుకుని కూలీలతో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దిలీప్, ప్రకాష్, ప్రవీణ్, భగత్‌సింగ్, పన్నాలాల్, రాజేష్‌ను అభినందించారు. కూలీలతో మాట్లాడుతున్న ఎల్. రాజయ్య, తమ పిల్లలకు భోజనం తినిపిస్తున్న కూలీలు మధ్యవర్తికోసం గాలింపు... మహారాష్ట్ర వలస కూలీలకు ఇవ్వాల్సిన కూలీడబ్బులు ఇవ్వకుండా పారిపోయిన కాజిపేటకు చెందిన వ్యక్తికోసం గాలిస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. వారి బంధువుల ద్వారా సమాచారం అందించినట్లు మున్సిపల్‌చైర్మన్ ఎల్.రాజయ్య వెల్లడించారు. -
పాల కోసం ఏడ్చి.. తనువు చాలించి..
ఆరునెలల పసిబాలుడి మృతి.. కాంట్రాక్టర్ పని ఒత్తిడి వల్లే పాలివ్వని తల్లి! హత్నూర: తల్లిపాల కోసం ఆరునెలల పసి బాలుడు ఏడ్చి.. ఏడ్చి తనువు చాలించాడు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మాతృమూర్తికి తీరని గర్భశోకం మిగిలింది. ఈ ఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం తుర్కలఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఓ పరిశ్రమలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామ శివారులో గల ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమలో పనిచేసేందుకు కాంట్రాక్టర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడుకు చెందిన కూలీలను తీసుకొచ్చాడు. వీరికి పరిశ్రమ ఆవరణలోనే గుడారాలను ఏర్పాటు చేశాడు. పనులు చేసేందుకు వచ్చిన వారిలో మల్లీశ్వరి అనే ఆమెకు ఆరు నెలల పసి బాలుడు ఉన్నాడు. రోజులాగే ఈ నెల ఏడున తన ఆరునెలల పసి బాలుడిని నివాసంలో పడుకోబెట్టి కుమార్తెను కాపలాగా ఉంచి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత నిద్రి లేచిన బాలుడు ఏడుస్తుండటంతో విషయాన్ని కుమార్తె.. తల్లి దృష్టికి తెచ్చింది. దీంతో మల్లీశ్వరి బిడ్డకు పాలు ఇచ్చి వస్తానని కాంట్రాక్టర్‌ను కోరినా అందుకాయన అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ పసికందు ఏడ్చి ఏడ్చి తనువు చాలించాడు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుం డా బాలుడిని నర్సాపూర్‌లోని ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి మల్లీశ్వరిని తన వెంట తీసుకెళ్లాడు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు గానీ.. నర్సాపూర్‌లోని ఓ శ్మశానవాటికలో బాలుడి మృతదేహాన్ని పూడ్చి, ఆమెను సొంతూరుకు పంపినట్లు తెలిసింది. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని హత్నూర పోలీసులు తెలిపారు. -
మహిళా కూలీపట్ల కాంట్రాక్టర్ అమానుషం
మెదక్: ఓ లేబర్ కాంట్రాక్టర్ మహిళా కూలీపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పసిపాపకు పాలివ్వకుండా తల్లిని కాంట్రాక్టర్ అడ్డుకున్నాడు. దాంతో పాప ఏడ్చి ఏడ్చి మృతిచెందినట్టు తెలిసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. పాప మృతిచెందిన విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ బాధితురాలిని కాంట్రాక్టర్ బెదిరించినట్టు తెలిసింది. మృతిచెందిన పసికందును కాంట్రాక్టర్ గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.