labour work
-
గిరిజన ఆణిముత్యం.. నీట్లో ఆల్ఇండియా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్
దహెగాం: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ కూలీ కూతురు. చిన్న తనంలోనే తండ్రి మృతి చెందగా తల్లి కూలీ పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించింది. తండ్రి క్యాన్సర్‌తో ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో ఆ పసి మనసులో అప్పటి నుంచే డాక్టర్ కావాలని తలపించింది. మా నాన్నలాగా ఎవరు మృతిచెందవద్దనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో 427 మార్కులు సాధించగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్ కై వసం చేసుకుంది. కొలవార్ తెగలో వైద్య విద్యను పూర్తి చేస్తే తొలి విద్యార్థిని సంగర్ష్ స్రవంతి కానుంది. కుటుంబ నేపథ్యం.. కుమురంభీం జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన సంగర్ష్ శంకర్, బుచ్చక్కలకు ఐదుగురు ఆడపిల్లలే. అందులో ఐదో సంతానమైన స్రవంతి 1 నుంచి 5వ తరగతి వరకు చంద్రపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివింది. 6 నుంచి 10వ తరగతి వరకు దహెగాంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదివింది. పదిలో 8.2 జీపీఏ సాధించింది. 9వ తరగతి చదువుతున్న క్రమంలో తండ్రి శంకర్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. శంకర్‌కు సరైన వైద్యం అందక చనిపోయాడని ఇరుగుపొరుగు వారు అనేవారు. అప్పుడే ఆమెలో డాక్టర్ కావాలనే ఆలోచన మొదలైంది. దీంతో బంధువుల సహకారంతో డీఆర్‌డీఏను సంప్రదింది హైదరాబాద్‌లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో సీటు సాధించింది. ఇంటర్ బైపీసీలో 934 మార్కులు సాధించింది. కుంగిపోకుండా చదివి.. ఇంటర్ పూర్తి చేసిన స్రవంతి డాక్టర్ కావాలని కోరిక ఉండగా ప్రైవేటులో నీట్ శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేక గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్రాల్డ్లో నీట్ శిక్షణ తీసుకుంది. మొదటి ప్రయత్నంలో నీట్లో సీటు కోల్పోయింది. అయినా కుంగిపోకుండా అధైర్యపడకుండా పట్టుదలతో చదివి రెండోసారి 427 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు సాధించి వైద్య విద్యకు ఎంపికై ంది. వైద్య విద్య పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కొలవార్ తెగలో మొదటి మహిళగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. నా బిడ్డను డాక్టర్‌గా చూడాలనుకున్నా నా భర్త ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిండు. నాకు ఐదుగురు ఆడపిల్లలే. నలుగురు పిల్లల పెండ్లీలు చేసినా. స్రవంతి ఐదవ బిడ్డ ఆమె చిన్నప్పటి నుంచి మంచిగ చదువుకుంటుంది. స్రవంతిని డాక్టర్ చదివించాలని నా కోరిక నేను కూలీ పనులు చేసుకుంటు ఆమెను చదివిపిచ్చినా మేము కష్టపడినట్లు నా బిడ్డ కష్టపడవద్దని ఆమెను చదివిపించి డాక్టర్ చేయాలని అనుకున్న. స్రవంతి డాక్టర్ అయితందని అందరు అంటురు. నాకు ఆనందంగా ఉంది. – బుచ్చక్క, స్రవంతి తల్లి, చంద్రపల్లి పేదలకు వైద్యం అందిస్తా సరైన వైద్యం అందక మా నాన్న చనిపోయినట్లు ఊర్లో అందరూ అనేవారు. అప్పటి నుంచే డాక్టర్ కావాలని అనుకున్న. కష్టపడి చదివితే సాధించవచ్చని అనుకుని నీట్ మొదటి సారి రాస్తే ర్యాంక్ రాలేదు. అయినా బాధపడకుండా రెండో సారి కోచింగ్ తీసుకుని ప్రయత్నం చేయగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. నాన్న లేకపోయినా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నిరుపేదలకు వైద్యం అందిస్తా. – స్రవంతి, చంద్రపల్లి -
అయ్యో.. ఏమైందో ఏమో!
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: కూలి పనికోసం వలస వచ్చిన వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాత్రి పడుకున్న మంచంపైనే తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ధన్వాడ మండ లం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నాగారం హను మంతు (65), భార్య వెంకటమ్మ(50)తో కలిసిఅబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్పూర్లో సుగుణ అనే మహిళా రైతు వద్ద హార్టీకల్చర్ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం ఇంకా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో సుగుణ వారిని పిలిచేందుకు వెళ్లింది. లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో పాటు దంపతులిద్దరూ స్పందించకపోవడంతో అనుమా నం వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. దీంతో కొంతమంది వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా హనుమంతుదంపతులు మంచంపై విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతుల కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!) -
జెండా ఎగురవేసి.. కూలి పనికి వెళ్లి..
ఆమె గ్రామ సర్పంచ్. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయడం బాధ్యత. మహిళగా కుటుంబ పోషణ బాధ్యత కూడా ఉంది. రెండు బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం, రాజవరం గ్రామ సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ. సర్పంచ్‌ను కదా స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూలీకిపోవడమేంటి అనుకోలేదు. సోమవారంనాడు ముందుగా జెండా ఎగరేసిన సైదమ్మ... అనంతరం రోజూవారీ కూలీగా నాటు వేయడానికి వెళ్లారు. గ్రామంలోని ఓ పొలంలో నాట్లు వేస్తూ ఇలా ‘సాక్షి’కి కనిపించారు. ‘నాటేయడానికి వెళ్తే రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు వస్తాయి. దీనితో కుటుంబం గడుస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఏముంటుంది?’అని చెబుతున్నారు. వార్డు మెంబర్ అయినా సరే కాలర్ ఎగరేసుకుని తిరిగే మగవాళ్లలా కాకుండా... పరిపాలనలో మహిళ ఉంటే పరిణామాలు భిన్నంగా ఉంటాయని నిరూపించారు. – తిరుమలగిరి(నాగార్జునసాగర్) -
Operation Muskaan: చిట్టిచేతులు వెట్టివెతలు!
సాక్షి, హైదరాబాద్: పలక, బలపం పట్టి అక్షరాలు నేర్వాల్సిన చిట్టిచేతులు ఇటుకపెళ్లలు పడుతున్నాయి. వసివాడని బాల్యం నుసిలో కొట్టుమిట్టాడుతోంది. వెట్టిచాకిరిలోనే బతుకు తెల్లారుతోంది. తల్లిఒడిలో సురక్షితంగా ఉండాల్సిన బాల్యం ఇటుకబట్టీల్లో బందీ అవుతోంది. పేదపిల్లలు, అనాథల బాల్యం అంధకారంలో మగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ నేతృత్వంలో వివిధ ప్రభుత్వ విభాగాలు ఆపరేషన్ ముస్కాన్; ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రెస్క్యూ చేసి బాలలను కాపాడుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రతీ ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాలకార్మికులు, వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని కాపాడేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒక్కసారి లెక్కలు చూస్తే... ►2020లో జరిగిన ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా 3,274 మంది చిన్నారులను రెస్క్యూ చేయగా, వీరిలో 1,982 మందిని కుటుంబాలకు చేర్చగా, 1,292 చిన్నారులను వారి వారి రాష్ట్రాలకు పంపించి వేశారు. ►2021 జరిపిన ఆపరేషన్ స్మైల్ ఏడో దఫాలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వెట్టిచాకిరి నుంచి 3,969 మంది చిన్నారులకు పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా విముక్తి కలిగించాయి. ఇందులో 2,662 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 1,307 ప్రభుత్వ బాలసదనాలకు అప్పగించారు. ►ఇకపోతే 2022 జనవరిలో నెలలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 600 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 433 మంది ఉండగా, 157 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ స్పష్టం చేసింది. రెస్క్యూ చేసినవారిలో 456 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 144 మందిని ప్రభుత్వ బాలసదనాలకు తరలించారు. ►ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో 3,406 మందిని రెస్క్యూ చేసినట్టు మహిళా, చిన్నారుల భద్రతావిభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 1,025 చిన్నారులున్నట్టు తెలిపారు. బాలకార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రాంతాలను, సంబంధిత పరిశ్రమల ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తూ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులకు తెలిసే... ఆపరేషన్ ముస్కాన్గానీ, స్మైల్ కార్యక్రమాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 80 శాతం కేసుల్లో తల్లిదండ్రులకు పిల్లలు పనిచేస్తున్న విషయం తెలుసని పోలీస్ శాఖ ఓ అంచనాకు వచ్చింది. కుటుంబ పరిస్థితులును దృష్టిలో పెట్టు కొని పిల్లలను పరిశ్రమల్లో పనికి పెడుతున్నట్టు దర్యాప్తులో బయటపడినట్టు తెలిసింది. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను టార్గెట్‌గా చేసుకొని వెట్టిచాకిరి మాఫియా చిన్నారులను పనుల్లో పెట్టి కమిషన్ల పేరిట దండుకుంటున్నట్టు వెలుగులోకి వచ్చిందని తెలిసింది. ఇప్పటివరకు ఆపరేషన్ స్మై ల్, ముస్కాన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కేసులకుపైగా నమోదు చేసినట్టు పోలీస్‌వర్గాలు తెలిపా యి. ఈ నేపథ్యంలో ఇటుకబట్టీల్లో బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనా. వచ్చేఏడాదిలో ఇతరత్రా పరిశ్రమలపై దృష్టి పెట్టి మిగిలిన బాలకార్మికులను సైతం రెస్క్యూ చేయాలని పోలీస్ శాఖ, ఇతర విభాగాలు భావిస్తున్నాయి. -
పని కోసం వెళ్తూ పరలోకాలకు..
ఖమ్మం బస్సు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా యువకుడి మృతి జ్యోతినగర్ : కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన అనువాల అశోక్‌కుమార్(25) సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో అసువులుబాశాడు. అనువాల కాంతయ్య–పద్మ దంపతుల రెండవ కుమారుడైన అశోక్‌కుమార్ ఇటీవలనే బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి వెల్డర్‌గా పనిచేస్తుండగా అతడి వద్ద వెల్డింగ్ పనిలో నైపుణ్యత పెంపొందించుకున్నాడు. కాకినాడలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిలో చేరేందుకు హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రయివేటు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. అశోక్‌కుమార్ వద్ద లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా ఎన్టీపీసీ ఎస్సై సాగర్‌కు ఖమ్మం పోలీసులు సమాచారం అందించారు. అశోక్‌కుమార్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అతడి అన్న విజయ్‌కుమార్, బంధువులు ఖమ్మం బయలుదేరి వెళ్లారు.