
ఆమె గ్రామ సర్పంచ్. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయడం బాధ్యత. మహిళగా కుటుంబ పోషణ బాధ్యత కూడా ఉంది. రెండు బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం, రాజవరం గ్రామ సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ. సర్పంచ్‌ను కదా స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూలీకిపోవడమేంటి అనుకోలేదు.
సోమవారంనాడు ముందుగా జెండా ఎగరేసిన సైదమ్మ... అనంతరం రోజూవారీ కూలీగా నాటు వేయడానికి వెళ్లారు. గ్రామంలోని ఓ పొలంలో నాట్లు వేస్తూ ఇలా ‘సాక్షి’కి కనిపించారు. ‘నాటేయడానికి వెళ్తే రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు వస్తాయి. దీనితో కుటుంబం గడుస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఏముంటుంది?’అని చెబుతున్నారు. వార్డు మెంబర్ అయినా సరే కాలర్ ఎగరేసుకుని తిరిగే మగవాళ్లలా కాకుండా... పరిపాలనలో మహిళ ఉంటే పరిణామాలు భిన్నంగా ఉంటాయని నిరూపించారు.
– తిరుమలగిరి(నాగార్జునసాగర్)