సాక్షి, హైదరాబాద్: పలక, బలపం పట్టి అక్షరాలు నేర్వాల్సిన చిట్టిచేతులు ఇటుకపెళ్లలు పడుతున్నాయి. వసివాడని బాల్యం నుసిలో కొట్టుమిట్టాడుతోంది. వెట్టిచాకిరిలోనే బతుకు తెల్లారుతోంది. తల్లిఒడిలో సురక్షితంగా ఉండాల్సిన బాల్యం ఇటుకబట్టీల్లో బందీ అవుతోంది. పేదపిల్లలు, అనాథల బాల్యం అంధకారంలో మగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ నేతృత్వంలో వివిధ ప్రభుత్వ విభాగాలు ఆపరేషన్ ముస్కాన్; ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రెస్క్యూ చేసి బాలలను కాపాడుతున్నాయి.
కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రతీ ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాలకార్మికులు, వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని కాపాడేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఒక్కసారి లెక్కలు చూస్తే...
►2020లో జరిగిన ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా 3,274 మంది చిన్నారులను రెస్క్యూ చేయగా, వీరిలో 1,982 మందిని కుటుంబాలకు చేర్చగా, 1,292 చిన్నారులను వారి వారి రాష్ట్రాలకు పంపించి వేశారు.
►2021 జరిపిన ఆపరేషన్ స్మైల్ ఏడో దఫాలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వెట్టిచాకిరి నుంచి 3,969 మంది చిన్నారులకు పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా విముక్తి కలిగించాయి. ఇందులో 2,662 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 1,307 ప్రభుత్వ బాలసదనాలకు అప్పగించారు.
►ఇకపోతే 2022 జనవరిలో నెలలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 600 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 433 మంది ఉండగా, 157 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ స్పష్టం చేసింది. రెస్క్యూ చేసినవారిలో 456 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 144 మందిని ప్రభుత్వ బాలసదనాలకు తరలించారు.
►ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో 3,406 మందిని రెస్క్యూ చేసినట్టు మహిళా, చిన్నారుల భద్రతావిభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 1,025 చిన్నారులున్నట్టు తెలిపారు. బాలకార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రాంతాలను, సంబంధిత పరిశ్రమల ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తూ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.
తల్లిదండ్రులకు తెలిసే...
ఆపరేషన్ ముస్కాన్‌గానీ, స్మైల్ కార్యక్రమాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 80 శాతం కేసుల్లో తల్లిదండ్రులకు పిల్లలు పనిచేస్తున్న విషయం తెలుసని పోలీస్ శాఖ ఓ అంచనాకు వచ్చింది. కుటుంబ పరిస్థితులును దృష్టిలో పెట్టు కొని పిల్లలను పరిశ్రమల్లో పనికి పెడుతున్నట్టు దర్యాప్తులో బయటపడినట్టు తెలిసింది. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను టార్గెట్‌గా చేసుకొని వెట్టిచాకిరి మాఫియా చిన్నారులను పనుల్లో పెట్టి కమిషన్ల పేరిట దండుకుంటున్నట్టు వెలుగులోకి వచ్చిందని తెలిసింది.
ఇప్పటివరకు ఆపరేషన్ స్మై ల్, ముస్కాన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కేసులకుపైగా నమోదు చేసినట్టు పోలీస్‌వర్గాలు తెలిపా యి. ఈ నేపథ్యంలో ఇటుకబట్టీల్లో బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనా. వచ్చేఏడాదిలో ఇతరత్రా పరిశ్రమలపై దృష్టి పెట్టి మిగిలిన బాలకార్మికులను సైతం రెస్క్యూ చేయాలని పోలీస్ శాఖ, ఇతర విభాగాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment