lack of treatment
-
ఆదిలాబాద్: గర్భిణి మృతిపై కలెక్టర్ సీరియస్
నార్నూర్ (గాదిగూడ): సకాలంలో వైద్యం అందక ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కునికాసా కొలాంగూడ గ్రామానికి చెందిన గర్భిణి కొడప రాజుబాయి (22) మృతిచెందిన ఘటనపై కలెక్టర్ సిక్తా పాట్నాక్, ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రా సీరియస్ అయ్యారు. గర్భిణి మృతిపై విచారణ జరిపి నివేదిక అందించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ను సోమవారం ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అధికారులతో కలిసి కునికాసా కొలాంగూడ గ్రామానికి వెళ్లారు. దాదాపు మూడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. గ్రామ శివారులోని వాగును మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ దాటారు. తర్వాత గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. రాజుబాయి మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందిఉంటే తమ కూతురు బతికేదని రాజుబాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకనే గర్భిణి మృతిచెందిందని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు వైద్యాధికారి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తప్పే అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదికను కలెక్టర్కు అందజేస్తామని పేర్కొన్నారు. -
యాదాద్రి: వైద్యం అందక రిక్షాలోనే వృద్ధురాలి మృతి
సంస్థాన్ నారాయణపురం: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ నిరుపేద వృద్ధురాలు ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యం కోసం వేచి చూసి ప్రాణాలొదిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన పూస బాలమ్మ(80) ఆలనాపాలనా చూసేవారు లేరు. దీంతో కొద్దిరోజుల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నివసిస్తున్న కూతురు సైదమ్మ వద్దకు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలమ్మ 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం పీహెచ్సీకి తీసుకొచ్చి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. వైద్యం కోసం గంటపాటు రిక్షాలోనే ఎదురుచూసింది. వైద్యురాలు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. తన తల్లి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సైదమ్మ ఆరోపించింది. ‘ఆహారం తీసుకోకపోవడంతో బాలమ్మ నీరసంగా ఉంది, పల్స్ పడిపోవడంతోనే మృతి చెందింది. నేను సిబ్బందితో నెలవారీ సమావేశంలో ఉన్నా. తెలిసిన వెంటనే వచ్చి పరిశీలించాను’అని వైద్యురాలు దీప్తి వివరణ ఇచ్చారు. -
వైద్యం అందక మహిళ మృతి
రాపూరు : రాపూరు ప్రభుత్వ వైద్యశాల ఆదివారం వైద్యులు లేని కారణంగా వైద్యం అందక ఓ మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సైదాపురం మండలం చీకవోలుకు చెందిన నక్కినేటి ఈశ్వరమ్మ (30) కొంత కాలంగా ఆయాసంతో బాధపడుతుంది. ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చి తీవ్ర ఆయాసానికి గురికావడంతో ఆమెను తల్లి రామసుబ్బమ్మ రాపూరు వైద్యశాలకు ఆటోలో తీసుకు వచ్చింది. అయితే రాపూరు వైద్యశాలలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈశ్వరమ్మ కొద్దిసేపటికే మృతి చెందింది. వైద్యులు ఉంటే తమ బిడ్డ బతికేదని ఈశ్వరమ్మ తల్లి రామసుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు.