వాగు దాటుతున్న ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్, తహశీల్దార్ మోతిరాం
నార్నూర్ (గాదిగూడ): సకాలంలో వైద్యం అందక ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కునికాసా కొలాంగూడ గ్రామానికి చెందిన గర్భిణి కొడప రాజుబాయి (22) మృతిచెందిన ఘటనపై కలెక్టర్ సిక్తా పాట్నాక్, ఐటీడీఏ పీవో భవేశ్‌మిశ్రా సీరియస్ అయ్యారు. గర్భిణి మృతిపై విచారణ జరిపి నివేదిక అందించాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్‌ను సోమవారం ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అధికారులతో కలిసి కునికాసా కొలాంగూడ గ్రామానికి వెళ్లారు. దాదాపు మూడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. గ్రామ శివారులోని వాగును మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ దాటారు.
తర్వాత గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. రాజుబాయి మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందిఉంటే తమ కూతురు బతికేదని రాజుబాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకనే గర్భిణి మృతిచెందిందని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు వైద్యాధికారి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తప్పే అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment