సంస్థాన్ నారాయణపురం: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ నిరుపేద వృద్ధురాలు ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యం కోసం వేచి చూసి ప్రాణాలొదిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన పూస బాలమ్మ(80) ఆలనాపాలనా చూసేవారు లేరు. దీంతో కొద్దిరోజుల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నివసిస్తున్న కూతురు సైదమ్మ వద్దకు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలమ్మ 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించింది.
దీంతో సంస్థాన్ నారాయణపురం పీహెచ్‌సీకి తీసుకొచ్చి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. వైద్యం కోసం గంటపాటు రిక్షాలోనే ఎదురుచూసింది. వైద్యురాలు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. తన తల్లి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సైదమ్మ ఆరోపించింది. ‘ఆహారం తీసుకోకపోవడంతో బాలమ్మ నీరసంగా ఉంది, పల్స్ పడిపోవడంతోనే మృతి చెందింది. నేను సిబ్బందితో నెలవారీ సమావేశంలో ఉన్నా. తెలిసిన వెంటనే వచ్చి పరిశీలించాను’అని వైద్యురాలు దీప్తి వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment