మహిళా ప్రొఫెసర్‌కు ఎన్ఆర్ఐ వేధింపులు
హైదరాబాద్ : సోషల్ మీడియా వేదికగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించినందుకు ఓ మహిళా ప్రొఫెసర్ వేధింపులకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన దీప నాయర్ మర్రిచెన్నారెడ్డి హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైరల్ అయిన ప్రధాని నరేంద్రమోదీ ప్రచార వీడియోకు ఆమె ఈనెల 18న కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ఆర్ఐ విజయ్ శేఖర్ అనే వ్యక్తి అసభ్యకర పదజాలంతో కామెంట్ చేశాడని దీప నాయర్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రొఫెసర్ దీప ఫిర్యాదుతో జుబ్లీహిల్స్ పోలీసులు ఎన్ఆర్ఐ విజయ్‌పై కేసు నమోదు చేశారు.
ఓ కామన్ ఫ్రెండ్ షేర్ చేసిన వీడియోకు తాను కామెంట్ చేశానని, ఈ కామెంట్‌కు ఎన్ఆర్ఐ విజయ్ శేఖర్ మాటల్లో చెప్పలేని పదజాలంతో వేధించాడని ఆమె సాక్షికి తెలిపారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా అతను వెనక్కు తగ్గకుండా తనకు సవాల్ విసిరాడన్నారు. భావప్రకటన స్వేచ్చ లేని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కామెంట్ల పట్ల ఫేస్‌బుక్‌కు సైతం ఫిర్యాదు చేశానని, వారు ఆ కామెంట్స్‌ను తొలిగించారని చెప్పారు. ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, అమెరికా ఎంబసీలకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.