lagoon
-
మొసలి నుంచి తప్పించుకొని కోమాలోకి ; ఆ తర్వాత
సాధారణంగా మొసలి నీళ్లలో ఉంటే వెయ్యి ఎనుగులంత బలం అంటారు. నీళ్లలో మొసలికి చిక్కామంటే మన ప్రాణాలు పోవడం ఖాయం. ఒక యువతి మాత్రం తన కవల సోదరి సాయంతో మొసలి పంజా నుంచి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.. కానీ పదిరోజుల పాటు కోమాలో ఉంది. తాజాగా కోమాలో నుంచి లేచిన ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూస్తానని అనుకోలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వివరాలు.. లండన్‌కు చెందిన 28 ఏళ్ల మెలిస్సా లౌరి, జార్జియా లౌరిలు కవలలు. ఇద్దరికి బోటింగ్ అంటే మహాప్రాణం. పదిరోజల కిందట మెక్సికోలోని మానియాల్టెపెక్ లగూన్ తీర ప్రాంతానికి బోటింగ్ వెళ్లారు. ప్యూర్టో ఎస్కాండిడో ఐలాండ్‌లో రాత్రికి బస చేశారు. ఆ రాత్రి సరదాగా ఐలాండ్ నుంచి పది మైళ్ల దూరంపాటు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మెలిస్సా ఉన్నట్టుండి నీళ్లలో మునిగిపోయింది. ఆమెకు కొంచెం దూరంలో ఉన్న జార్జియా మెలిస్సా కనిపించకపోవడంతో గట్టిగా కేకలు వేసింది. ఏ రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ప్రమాదంలో పడిందని గ్రహించిన జార్జియా ఆమె దగ్గరికి వెళ్లింది. అప్పటికే మెలిస్సా కాలును బలంగా పట్టుకున్న మొసలి ఆమెను నీటి అడుగుభాగంలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే జార్జియా చాకచక్యంగా వ్యవహరించి రక్షణ కోసం తనతో పాటు తెచ్చుకున్న వస్తువును మొసలిపై పదేపదే దాడికి పాల్పడంతో మొసలి తన పట్టును విడవడంతో వారిద్దరు నీటిపైకి వచ్చారు. అయితే మొసలి మరోసారి దాడిచేయడంతో ఈసారి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా ఎలాగోలా మెలిస్సాను మొసలి బారీ నుంచి కాపాడి బయటకు తీసుకువచ్చింది. కానీ మెలిస్సా అప్పటికే సృహ కోల్పోయి కోయాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి బయటపడిన వీరిద్దరు ఆసుపత్రిలో చేరారు. జార్జియా గాయాలనుంచి కోలుకోగా.. పది రోజల పాటు కోమాలో ఉండిపోయిన మెలిస్సా రెండు రోజుల క్రితం కళ్లు తెరవడంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆందోళన తగ్గింది. కోమా నుంచి బయటపడినా ఊపిరి తీసుకోవడంలో మెలిస్సాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఇప్పడిప్పుడే తనంతట తాను ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో డాక్టర్లు ఆక్సిజన్ పైప్‌ను తీసేశారు. ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. కాగా 2019లో 54 ఏళ్ల వ్యక్తి తన బొటనవేలితో మొసలి కంట్లో పొడిచి తన ప్రాణాలను దక్కించుకోవడం సంచలనంగా మారింది. చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు -
న్యూజిలాండ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం
-
చెరువులోకి విమానం
వెల్లింగ్టన్, న్యూజిలాండ్ : రన్ వే మీద ఆగాల్సిన విమానం కాస్తా అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దాంతో విమానంలో ఉన్న ప్రయాణికులు పడుతూ.. లేస్తూ.. ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని మైక్రోనేషియన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. దాంతో ఒక్కసారిగా రన్‌వే పై నుంచి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అయితే చెరువు లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు. ఈ లోపు ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. కానీ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
భార్య చేతిలో భర్త హతం?
గొడ్డలితో నరికి దారుణ హత్య పోలీసుల అదుపులో ఇల్లాలు పిట్లం మండలం అల్లాపూర్‌లో ఘటన పిట్లం: ఇంట్లో ఉన్న ఓ యువకుడిని గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. భార్యే అతడ్ని హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అల్లాపూర్‌కు చెందిన లక్ష్మణ్ (38)కు, బిచ్కుంద మండలంలోని పుల్కల్కు చెందిన రుక్మిణితో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో రుక్మిణి పిల్లలను వదిలేసి నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో చాలాసార్లు పంచాయితీ జరిగింది. భార్యను తీసుకెళ్లాలని, లేకపోతే నష్ట పరిహారం చెల్లించాలని పెద్ద మనుషుల ద్వారా రాయబారం నడిచింది. దీనిపై బిచ్కుంద పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఎట్టకేలకు మూడు నెలల క్రితం రుక్మిణి కాపురానికి వచ్చింది. కుమారుడు నవోదయ పాఠశాలలో చదువుతుండగా, భార్య, ఇద్దరు కూతుళ్లు, తన తల్లి గంగవ్వతో కలిసి లక్ష్మణ్ ఇంటి వద్ద ఉంటున్నాడు. సోమవారం గంగవ్వ తన మనవరాలిని తీసుకొని, చిల్లర్గిలో ఉండే కూతురు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో రాత్రి భార్యభర్తలతో పాటు కూతురు మమత (10) నిద్రకు ఉపక్రమించారు. ఏం జరిగిందో ఏమో కాని తెల్లారేసరికి లక్ష్మణ్ ఇంట్లో మృతదేహామై కనిపించాడు. దుండగులు కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. అయితే, కోడలు రుక్మిణియే తన కుమారుడిని హత్య చేసిందని గంగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. రుక్మిణిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐ వెంకటరమణారెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు, నలుగురు కలిసి..! ముగ్గురు లేదా నలుగురు కలిసి లక్ష్మణ్‌ను హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కూతురు మమత చెబుతున్నది కూడా అందుకు బలం చేకూరుస్తోంది. రాత్రి పది గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకొని వచ్చారని ఆమె చెబుతోంది. భయంతో వణికిపోతున్న ఆమె అంతకు మించి ఏమి చెప్పడం లేదు. అయితే, రుక్మిణితో పాటు ఆమెకు సంబంధం ఉన్న వారే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గ్రామస్తులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. తాను భార్యను కాపురానికి తీసుకెళ్లనని, తీసుకెళ్తే తన ప్రాణాలు తీస్తుందని గతంలో జరిగిన పంచాయితీల సందర్భంగా లక్ష్మణ్ పలుసార్లు చెప్పాడని గ్రామ పెద్దలు తెలిపారు. అతడు అన్నట్లే ఇప్పుడు జరిగిందని వాపోయారు.