భార్య చేతిలో భర్త హతం?
-
గొడ్డలితో నరికి దారుణ హత్య
-
పోలీసుల అదుపులో ఇల్లాలు
-
పిట్లం మండలం అల్లాపూర్‌లో ఘటన
పిట్లం:
ఇంట్లో ఉన్న ఓ యువకుడిని గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. భార్యే అతడ్ని హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అల్లాపూర్‌కు చెందిన లక్ష్మణ్ (38)కు, బిచ్కుంద మండలంలోని పుల్కల్‌కు చెందిన రుక్మిణితో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో రుక్మిణి పిల్లలను వదిలేసి నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో చాలాసార్లు పంచాయితీ జరిగింది. భార్యను తీసుకెళ్లాలని, లేకపోతే నష్ట పరిహారం చెల్లించాలని పెద్ద మనుషుల ద్వారా రాయబారం నడిచింది. దీనిపై బిచ్కుంద పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఎట్టకేలకు మూడు నెలల క్రితం రుక్మిణి కాపురానికి వచ్చింది. కుమారుడు నవోదయ పాఠశాలలో చదువుతుండగా, భార్య, ఇద్దరు కూతుళ్లు, తన తల్లి గంగవ్వతో కలిసి లక్ష్మణ్ ఇంటి వద్ద ఉంటున్నాడు. సోమవారం గంగవ్వ తన మనవరాలిని తీసుకొని, చిల్లర్గిలో ఉండే కూతురు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో రాత్రి భార్యభర్తలతో పాటు కూతురు మమత (10) నిద్రకు ఉపక్రమించారు. ఏం జరిగిందో ఏమో కాని తెల్లారేసరికి లక్ష్మణ్ ఇంట్లో మృతదేహామై కనిపించాడు. దుండగులు కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. అయితే, కోడలు రుక్మిణియే తన కుమారుడిని హత్య చేసిందని గంగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. రుక్మిణిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐ వెంకటరమణారెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ముగ్గురు, నలుగురు కలిసి..!
ముగ్గురు లేదా నలుగురు కలిసి లక్ష్మణ్‌ను హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కూతురు మమత చెబుతున్నది కూడా అందుకు బలం చేకూరుస్తోంది. రాత్రి పది గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకొని వచ్చారని ఆమె చెబుతోంది. భయంతో వణికిపోతున్న ఆమె అంతకు మించి ఏమి చెప్పడం లేదు. అయితే, రుక్మిణితో పాటు ఆమెకు సంబంధం ఉన్న వారే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గ్రామస్తులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. తాను భార్యను కాపురానికి తీసుకెళ్లనని, తీసుకెళ్తే తన ప్రాణాలు తీస్తుందని గతంలో జరిగిన పంచాయితీల సందర్భంగా లక్ష్మణ్ పలుసార్లు చెప్పాడని గ్రామ పెద్దలు తెలిపారు. అతడు అన్నట్లే ఇప్పుడు జరిగిందని వాపోయారు.