లైఫ్‌లో ఏం కావాలంటే...
విశాఖ : ‘‘ప్రతి మనిషికీ కొన్ని ఇష్టాలుంటాయి.. మరికొన్ని అయిష్టాలూంటాయి. వాటిన్నంటినీ పాజిటివ్‌గా తీసుకొని, నిత్యం ఉత్సాహం.. ఉత్తేజం.. ఉన్నతంగా జీవించాలనేది నా ఆశయం. అలా అని మితిమీరిన ఆశావాహ వైఖరిని కాను. చిన్నప్పటి నుంచి సామాజిక దృక్పథం అలవరుచుకున్నాను. పుట్టింది.. పెరిగింది.. హైదరాబాదే. విశాఖపట్నమంటే నా మనస్సుకు నచ్చిన నగరం. షూటింగ్‌కు వచ్చినప్పడల్లా తనవి తీరా నగరమంతా కలయ తిరగకుండా తిరిగి వెళ్లను....’’అంటున్నారు.. వర్దమాన సినీ నటి శ్వేత వర్మ. ఇటీవల ‘లైలా..ఓలైలా’ చిత్రీకరణ పూర్తి చేసుకొని అనంతరం రామానాయుడు స్టూడియోలో ‘సాక్షి’తో ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే..
కష్టే ఫలి...అనేది నా సూత్రం
ఏ పనిలోనైనా కష్టపడితేనే దాని చివరి ఫలితం అమృతం. అందుకు నటనలో నేను చాలా కష్టపడి పనిచేయగలననే పేరు సినీ పరిశ్రమలో స్వల్ప వ్యవధిలోనే సంపాదించా!. నాన్నగారు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో డీన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేశా. అమ్మ ప్రోత్సాహంతోనే నటనా జీవితంలో అడుగు పెట్టా.
షార్ట్ ఫిల్మ్‌తో అడుగులు...
తొలుత షార్ట్‌ఫిల్మ్‌లో నటించాను. అనంతరం మనం, లక్ష్మీరా మా ఇంటికి, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్‌సింగ్, వర్షం, హోలీ వంటి చిత్రాల్లో అవకాశాలు రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాను. మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. విజయాలు పరంపర మన సొంతం కావాలంటే నిత్యం సాధన చేయాలనేది నా సిద్ధాంతం. అందులో భాగంగానే నిత్యం నటనలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి సాధన చేస్తుంటాను. ఖాళీ సమయంలో జిమ్‌కు వెళ్లడం..కూచిపూడి, భరత నాట్యం సాధన చేస్తూ ఉంటాను.
వైజాగ్ చుట్టొచ్చాను...
పూర్తిస్థాయిలో లైలా..ఓ లైలా చిత్రంలో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రం మూడువంతులు విశాఖలోనే చిత్రీకరించడం వల్ల విశాఖ పరిసర ప్రాంతాలన్నీ తనివితీరా చూసే అవకాశం కలిగింది. ఇక్కడ వాతావరణం, ప్రజలు, సుందర దృశ్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.