Lakhs of rupees
-
యాచకురాలి వద్ద 2.58 లక్షలు నగదు
జమ్మూ: 65 ఏళ్ల యాచకురాలిని పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆమె నివసించిన స్థలంలో ఏకంగా రూ. 2.58 లక్షల నగదు లభించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో చోటు చేసుకుంది. నగరంలోని వెటర్నరీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమెను మెరుగైన పునరావాస కేంద్రానికి తరలించాక ఆ షెల్టర్‌ను శుభ్రం చేస్తుండగా డబ్బు దొరికిందని అదనపు డిప్యూటీ కమిషనర్ సుఖ్‌దేశ్ సింగ్ సమ్యాల్ చెప్పారు. డబ్బు దాచుకున్న యాచకురాలు ఎవరో తెలియదని పేర్కొన్నారు. మున్సిపల్ కమిటీ మంగళవారం ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తుండగా.. సంచుల్లో నోట్లు, నాణేలు దొరికాయని అన్నారు. మొత్తం లెక్కించగా రూ.2,58,507 ఉన్నట్లు అధికారులు తేల్చారు. డబ్బును యాచకురాలికే చేరేలా చూస్తామని సుఖ్‌దేశ్ చెప్పారు. నిజాయతీతో వ్యవహరించిన మున్సిపల్ కమిటీని అభినందించారు -
జూలియెట్ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు
సాక్షి, సిటీబ్యూరో: నమ్మిన సమీప బంధువుకే టోకరా వేసి, ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు కాజేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ పరిధిలో నమోదైన సైబర్ నేరంలో ఈ చర్య తీసుకున్నామని, ఆత్మహత్య కేసును నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో జూలియెట్ అనే మహిళ ఒంటరిగా ఉండేది. ఆమె దగ్గర కుటుంబీకులు లేకపోవడంతో వరుసకు సోదరుడయ్యే జోసెఫ్ చేదోడు వాదోడుగా ఉండేవాడు. తనకు డబ్బు అవసరమైనప్పుడు ఆమె జోసెఫ్‌కు తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పడంతో పాటు డెబిట్‌కార్డు ఇచ్చి పంపేది. దీనిని ఆసరాగా చేసుకున్న అతడు సొంతానికి కొంత డబ్బు డ్రా చేసుకున్నాడు. ఆమె ఫోన్లో ఉన్న సదరు బ్యాంకు యాప్ ద్వారా మరికొంత మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకుని కాజేశాడు. ఇలా మొత్తం రూ.5 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయమైనట్లు జనవరిగుర్తించిన జూలియెట్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా గత నెల 13న ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసును దర్యాప్తు చేసిన అధికారులు జోసెఫ్‌ను నిందితుడిగా తేల్చారు. బుధవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
వ్యాపారానికి చిన్న... ఔదార్యంలో పెద్ద
ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు.. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. తాను వృద్ధాశ్రమంలో ఉంటూ.. కష్టపడి సంపాదించిన రూ.50 లక్షలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లికి చెందిన సిరిపురం విశ్వనాథం గుప్తా. సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన కష్టార్జితం నుండి రూ.50 లక్షలను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించాలని కోరుతూ చెక్ అందజేశారు. 78 సంవత్సరాల వయసులో, మట్టపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెళ్ల్లదీస్తున్న విశ్వనాథం ‘‘యాభై ఏళ్లు వ్యాపారంలో ఎంతో సంపాదించా.. నేను పుట్టిన తీగుళ్ల (జగదేవ్‌పూర్)తో పాటు నేను పెరిగి, వ్యాపారం చేసిన హుజూర్నగర్ ప్రాంతంలోనూ అనేక దేవాలయాలకు ఆర్థిక సహాయం చేశా.. కానీ ఈ చరమాంకంలో దేశంకోసం పోరాడుతున్న సైన్యం, వారి కుటుంబాలకు నాకు తోచిన సహాయం చేయాలని పించింది. మిత్రుడు లక్ష్మణరావు సహకారంతో సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ను సంప్రదించి రూ.50 లక్షలను గవర్నర్ చేతుల మీదుగా సైన్యానికి విరాళమిచ్చా.. ఈ రోజు చేసిన పనే నాకు అత్యంత సంతృప్తిని కలిగిస్తోంది’ అని సాక్షితో చెప్పారు. ఇదే విషయమై సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్ మాట్లాడుతూ విశ్వనాథం భూరి విరాళం ఈ సమాజంలోని అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. -
‘దేవుడి’ సొమ్ముకే టెండర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. టెండర్లు పిలువకుండానే, లక్షలాది రూపాయల మేర అభివృద్ధి పనులను కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనేది పక్కనబెడితే, దీని వల్ల లక్షలాది రూపాయల మేర దేవుడి సొమ్ము దుర్వినియోగమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా రూ.30 వేలు పైబడి ఖర్చు చేసే ఏ పనికైనా దేవస్థానం మాన్యువల్ టెండర్‌ను పిలవాలి. అలాగే లక్ష రూపాయలు పైబడి జరిగే పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్‌ను పిలిచి, ఎవరు తక్కువకు టెండర్ వేస్తే.. వారికే పనులను అప్పగించాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో, సకాలంలో పనులు పూర్తవడంతో పాటు, పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అత్యవసరం పేరుతో 90 శాతం అభివృద్ధి పనులను ఎటువంటి టెండర్లూ లేకుండానే చకచకా కానిచ్చేస్తున్నారు. తమకు కావాల్సిన వారికి అధికారులు పనులను అప్పగించి, వారికి సొమ్ములను ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి పనులు అప్పగింత ద్వారకాతిరుమలలో దాదాపు ఐదు జేసీబీలు ఉండగా, ఎప్పుడూ ఒక జేసీబీ యజమానికే దేవస్థానం ఇంజినీరింగ్ విభాగ అధికారులు పనులను అప్పగిస్తున్నారు. ఈ విషయంలో గతేడాది సెప్టెంబర్ 7న ఇద్దరు జేసీబీ యజమానులకు, దేవస్థానం అధికారులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. చివరకు ఆ గొడవ రోడ్డుపైనే సెటిల్మెంట్ అయ్యింది. అయినా అధికారులు తమకు అనుకూలంగా ఉన్న ఆ జేసీబీ యజమానికే ఇప్పటికీ టెండర్లు లేకుండా పనులను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలపైబడి జరిగిన పనులకు సైతం రూ.30 వేలు లోపు, పలు బిల్లులను పెడుతూ ఆ వ్యక్తికే లబ్ధి చేకూరుస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి శేషాచలకొండపై ఇటీవల జేసీబీతో జరుగుతున్న పనులు తక్కువ పని చేసినా.. జేసీబీ దాదాపు 4 గంటలు పనిచేస్తే, 10 గంటలు పనిచేసినట్లు బిల్లుల్లో చూపుతూ, గంటకు రూ.వెయ్యి వరకు అధికారులు ఆ వ్యక్తికి నగదు చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీ ఎంత సమయం పనిచేసిందనే దాన్ని రీడింగ్ రూపంలో సంబంధిత సిబ్బంది లాక్‌బుక్ రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే దేవస్థానం బిల్లులను చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పనులకు ఎటువంటి లాక్‌బుక్ లేనట్లు తెలుస్తోంది. తక్కువ పనిచేసినా.. ఎక్కువ పనిచేసినట్లు సిబ్బంది చేప్పే, ఒట్టి నోటి మాటల ద్వారానే, పెద్ద మొత్తంలో బిల్లులు ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చినవెంకన్న సొమ్ముకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొక్కల పెంపకానికి, ఇతర పనులకు మట్టిని తోలే పనులను సైతం అదే వ్యక్తికి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇలా అన్ని పనులూ దాదాపుగా ఒకే వ్యక్తికి అధికారులు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆ చినవెంకన్నకే తెలియాలి. ఇప్పటికైనా అధికారులు నిబంధనలను పాటించి, అభివృద్ధి పనులకు టెండర్లను పిలవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజును వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఒక్కో పోస్టుకు రూ.25 లక్షలు?
సాక్షి, అమరావతి: జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్స్(జేఏఓ) పోస్టుల భర్తీలో ఏపీ జెన్కో రోజుకో కొత్త నిబంధనను తెరపైకి తెస్తోంది. ఓ మంత్రి, కొందరు అధికారులకు బాగా కావాల్సిన వారికి ఈ పోస్టులను కట్టబెట్టేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బేరం కుదరిందని, ఒక్కో పోస్టుకు రూ.25 లక్షల దాకా వసూలు చేసినట్టు జెన్కో వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 26 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నవంబర్ 10వ తేదీన ఏపీ జెన్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజులకే గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. రాత పరీక్షలో ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులిస్తారనేది నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు వెల్లడించలేదు. తర్వాత ఒక్కో సబ్జెక్టుకు ఇచ్చే మార్కుల వివరాలను నవంబర్ 23న జెన్కో వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 15న జెన్కో మరో సవరణ చేసింది. జెన్కోలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 10 మార్కులు వెయిటేజీ ఇస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ జెన్కోలో జేఏవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడడం ఇదే తొలిసారి. ఈ పోస్టులకు దాదాపు 15 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు నిరుద్యోగులు రూ.500 చెల్లించారు. తీరా జెన్కోలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వడం, నిబంధనలను వారికి అనుకూలంగా మార్చడం వల్ల ఇతరులెవరికీ ఈ పోస్టులు దక్కే అవకాశం కనిపించడం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి నిబంధనల్లో మార్పు తేవడం వెనుక ఓ మంత్రి, జెన్కోలో పనిచేస్తున్న కీలక వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగులతో ముందస్తుగా బేరం కుదుర్చుకుని, తర్వాత నిబంధనలు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, జెన్కో నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. -
పోలీసుల తనిఖీల్లో డబ్బే డబ్బు
చిత్తూరు: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే రీతిలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బును ప్రతి రోజూ లక్షల్లో స్వాధీనం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు చెక్‌పోస్టు వద్ద ఆదివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 9 లక్షల రూపాయిల నగదు, 1.6 కేజీల బంగారం, 6 కేజీల వెండి పట్టుబడింది. కడప జిల్లా జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఆటోలో తరలిస్తున్న 9.50 లక్షల రూపాయిల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పరిగి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న 9 లక్షల రూపాయిల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు. ఇక నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్ పేట చౌరస్తా వద్ద కారులో తరలిస్తున్న 9.80 లక్షల రూపాయిల నగదును పోలీసులు పట్టుకున్నారు.