సాక్షి, సిటీబ్యూరో: నమ్మిన సమీప బంధువుకే టోకరా వేసి, ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు కాజేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ పరిధిలో నమోదైన సైబర్ నేరంలో ఈ చర్య తీసుకున్నామని, ఆత్మహత్య కేసును నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో జూలియెట్ అనే మహిళ ఒంటరిగా ఉండేది. ఆమె దగ్గర కుటుంబీకులు లేకపోవడంతో వరుసకు సోదరుడయ్యే జోసెఫ్ చేదోడు వాదోడుగా ఉండేవాడు. తనకు డబ్బు అవసరమైనప్పుడు ఆమె జోసెఫ్‌కు తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పడంతో పాటు డెబిట్‌కార్డు ఇచ్చి పంపేది. దీనిని ఆసరాగా చేసుకున్న అతడు సొంతానికి కొంత డబ్బు డ్రా చేసుకున్నాడు. ఆమె ఫోన్‌లో ఉన్న సదరు బ్యాంకు యాప్ ద్వారా మరికొంత మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకుని కాజేశాడు. ఇలా మొత్తం రూ.5 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయమైనట్లు జనవరిగుర్తించిన జూలియెట్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా గత నెల 13న ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసును దర్యాప్తు చేసిన అధికారులు జోసెఫ్‌ను నిందితుడిగా తేల్చారు. బుధవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment