టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లతో శాఖమూరి నవీన్ (ఫైల్)
నరసరావుపేట టౌన్(పల్నాడు జిల్లా): పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి దళిత యువతిని దగా చేసిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్ బండారం బట్టబయలైంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటలోని చంద్రబాబు కాలనీకి చెందిన ఓ దళిత యువతి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేది.
ఆమెకు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెంకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్‌తో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. తనకు వివాహం కాలేదని నమ్మబలికిన నవీన్ ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో తక్కువ కులం దానివని దూషిస్తూ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కేసు పెడతానని చెప్పగా.. 2019 అక్టోబర్ 24న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
అనంతరం బరంపేటలో కాపురం పెట్టాడు. 2020 మార్చిలో ఆమెకు బాబు జన్మించాడు. కాగా, నవీన్‌కు అప్పటికే మరో యువతితో వివాహమైన విషయం బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీయడంతో దళిత యువతిని మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. వేరే నంబర్‌ను వినియోగిస్తున్నాడని తెలిసి ఫోన్ చేయగా ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి బలవంతంగా ఇంటినుంచి బయటకు నెట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరేంద్రబాబు బుధవారం తెలిపారు.
నవీన్‌పై పేకాట, బెట్టింగ్ కేసులు
నవీన్‌పై గతంలో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహణ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికి టీడీపీ ముఖ్యనేతలు అతడికి రాష్ట్ర పదవి కట్టబెట్టి, పదవిలోనే కొనసాగిస్తున్నారు. దళిత యువతిని మోసం చేసి రోడ్డు పాల్జేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుణ్ణి అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని పలువురు దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment