పోలీసుల తనిఖీల్లో డబ్బే డబ్బు
చిత్తూరు: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే రీతిలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బును ప్రతి రోజూ లక్షల్లో స్వాధీనం చేసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు చెక్‌పోస్టు వద్ద ఆదివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 9 లక్షల రూపాయిల నగదు, 1.6 కేజీల బంగారం, 6 కేజీల వెండి పట్టుబడింది. కడప జిల్లా జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఆటోలో తరలిస్తున్న 9.50 లక్షల రూపాయిల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పరిగి చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న 9 లక్షల రూపాయిల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు. ఇక నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్ పేట చౌరస్తా వద్ద కారులో తరలిస్తున్న 9.80 లక్షల రూపాయిల నగదును పోలీసులు పట్టుకున్నారు.