దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం
మహాకవి ‘జాషువా కళా పీఠం’ ప్రతి సంవత్సరం జాషువా జయంతి వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక ‘జాషువా సాహితీ పురస్కారా’న్ని ప్రదానం చేస్తున్నారు. ఇప్పటివరకూ కొలకలూరి ఇనాక్, పాపినేని శివ శంకర్, ఎండ్లూరి సుధాకర్, ఆ తరు వాత ‘పడమటి గాలి’ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు ఈ అవార్డును స్వీకరించారు. ఈ సంవత్సరం ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు జి. లక్ష్మీ నరసయ్య (ఎల్ఎన్)కు దీనిని ప్రదానం చేస్తున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా సాహిత్య విమర్శకునిగా, కవిగా, ఉపన్యాసకునిగా, సిద్ధాంత సమన్వయకర్తగా దళిత బహుజన సాహిత్య సమాజాన్ని చైతన్య పరుస్తున్నాడు ఎల్ఎన్. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో 1995లో జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ సంపాదకత్వంలో వచ్చిన ‘చిక్కనవుతున్న పాట’ కవితా సంకలనం ఒక పెను సంచలనం. తెలుగు సాహిత్య చరిత్ర ‘చిక్కనవుతున్న పాట’కు ముందు, తరువాత అన్నంతగా ఆ సంకలనం చరిత్ర సృష్టించింది. ఈ పుస్తకం ప్రేర ణతో అనేకమంది యువ కవులు కవిత్వం రాయడం మొదలుపెట్టారు.
తాను అప్పట్లో ‘వరదయ్య’ పేరుతో కవిత్వం రాసేవాడు. దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలో ప్రతి సోమవారం ‘సాహిత్య పేజీ’లో, ‘ఆదివారం అను బంధం’ పేజీలలో తాను కవిత్వం రాస్తూ, ఇతరుల కవిత్వాన్ని సమీక్షిస్తూ, ‘కవితా నిర్మాణ పద్ధతుల’ను తెలియజేస్తూ, సాహిత్య సమాజం, పరిశోధకులు, సాధారణ పాఠకులు... ‘ఈరోజు ఏ కవిత వస్తుంది, ఏ అంశంపై వ్యాసం వస్తుంద’ని ఎదురుచూసే ట్లుగా దళిత సాహిత్య పంటను పండించిన కృషీవలుడు లక్ష్మీనరసయ్య.
‘చిక్కనవుతున్న పాట’ దళిత ఉద్యమానికే దారి చూపే భూమికగా పదునెక్కాక, 1996లో ‘పదునెక్కిన పాట’ అనే పేరుతో మరో దళిత కవితా సంకలనాన్ని సహచర దళిత కవుల సంపాదకవర్గంతో కలిసి తీసుకు వచ్చారు. దళిత సాహిత్యానికి ‘అంబేడ్క రిజ’మే అంతిమ మార్గమనే స్పష్టమైన అవగాహనతో, దళిత స్త్రీవాద రచయిత్రులు రాసిన పదునైన కవితలు, ‘దండోరా’ ఉద్యమాన్ని స్వాగతిస్తూ వచ్చిన కవితలతో వచ్చిన ఈ పుస్తకం ఇది. సంకలనాలే కాకుండా ఎల్ఎన్ స్వయంగా ‘దళిత సాహిత్యం – తాత్విక దృక్పథం’, ‘ద ఎసెన్స్ ఆఫ్ దళిత్ పొయెట్రీ : ఎ సోషియో ఫిలసాఫిక్ స్టడీ’ గ్రంథాలనూ; కవిత్వం ఎలా రాయాలో చెప్పే ‘కవితా నిర్మాణ పద్ధతులు’, సాహిత్య విమర్శను తెలియ చెప్పే ‘సామాజిక కళా విమర్శ’నూ రాశారు. అలాగే ‘అస్తిత్వ ఉద్యమాల ఆది గురువు మహాత్మా జ్యోతిబాపూలే’ గ్రంథాన్నీ, ఎంతో చర్చకు కారణమైన ‘అంబేడ్కర్ తాత్వికుడు కాడా?’, ‘అంబేడ్కర్ అంటే ఏమిటి?’ వంటి వందలాది వ్యాసాలు రాశాడు. ప్రస్తుతం ‘కవి సంగమం’, ‘సారంగ’ లాంటి అంతర్జాల పత్రికలలోనూ విరివిగా రాస్తున్నారు. ‘కవిత్వం–చర్చనీయాంశాలు’ పుస్తకం ‘కవి సంగమం’లో వచ్చిన వ్యాసాల సంకలనమే. (క్లిక్ చేయండి: మనువును జయించిన విశ్వనరుడు)
అగ్రవర్ణ కథానాయకులను తిరస్కరించి దళిత కథా నాయకుణ్ణి సాహిత్యానికి పరిచయం చేసినవాడు జాషువా. అగ్రవర్ణ సాహిత్యాన్ని తిరస్కరించి దళిత సాహిత్యాన్ని తెలుగు ప్రపంచంలో పాదుకొల్పినవాడు లక్ష్మీనరసయ్య. జాషువా అందమైన పద్యం రాస్తే, ఎల్ఎన్ ఆ పద్యాన్ని ఆర్ద్రతతో ఆలపిస్తాడు. పదునైన కవిత్వం రాస్తూ, నిబద్ధమైన విమర్శ చేస్తూ, సిద్ధాంతాన్ని ఉపన్యాసంగా మారుస్తూ జాషువా పద్యాన్ని అద్భుతంగా తన కంఠంతో ప్రచారం చేస్తున్నందుకుగానూ... ప్రస్తుత ఎమ్మెల్సీ, సాహితీ పోష కులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ పురస్కారాన్ని’ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు ఎల్ఎన్ సాహితీ కృషికి దక్కిన గౌరవం మాత్రమే కాదు, దళిత సాహితీ ప్రపంచానికి దక్కిన గౌరవం. (క్లిక్ చేయండి: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు)
- డాక్టర్ కాకాని సుధాకర్, కవి
(జి. లక్ష్మీనరసయ్యకు జాషువా పురస్కార ప్రదానం)