నాగారం గ్రామంలో చోరీ
కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలో ఓ ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదును మాయం చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరగ్గా గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామం లక్ష్మీనగర్ కాలనీ నివాసి పాండు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం భువనగిరి వెళ్లాడు.
ఇంట్లో ఎవరూ లేని సంగతి పసిగట్టిన దొంగలు రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులోని 6 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, 31 వేల నగదును ఎత్తుకుపోయారు. పాండు కుటుంబసభ్యులు గురువారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుని చూడగా చోరీ సంగతి తెలిసింది. ఈ మేరకు వారు కీసర పోలీసులకు సమాచారం అందించారు.