Lakshmipur Balancing Reservoir
-
దిగువ మానేరుకు ఎగువ నీరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మధ్యమానేరు (రాజరాజేశ్వర ప్రాజెక్టు) నుంచి సుమారు 40 వేల క్యూసెక్కుల నీటిని కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాంకు వదిలారు. శుక్రవారం రాత్రి ఈఎన్సీ అనిల్‌కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలసి నీటిని విడుదల చేశారు. భారీగా వస్తున్న నీటితో లోయర్ మానేరు జలాశయం కళకళలాడుతోంది. నీటిని విడుదల చేసే సమయంలో కందికట్కూరు గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో కొంత ఆలస్యమైంది. గ్రామస్తులను ఒప్పించి నీటిని విడుదల చేశారు. అధికారులు సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి 10 గంటలకు మిడ్‌మానేరు నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల్లోని కందికట్కూరు, పొత్తూరు, చొక్కారావుపల్లి గ్రామాల్లో కాపరులకు చెందిన 240 గొర్రెలు వరదలో కొట్టుకుపోయాయి. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో 13 మంది గొర్రెల కాపర్లు కూడా వరద ఉధృతిలో చిక్కుకున్నారు. పలు ద్విచక్రవాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. అయితే పలువురు కాపర్లు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు మిగతా వారిని రక్షించారు. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో లోయర్ మానేరులో నీటిమట్టం ఒక్కరోజులోనే 3.7 టీఎంసీల నుంచి 6 టీఎంసీలకు చేరుకుంది. బాహుబలి నాలుగో పంపు నుంచి కూడా మధ్యమానేరు నుంచి లోయర్ మానేరుకు నీటి విడుదల నేపథ్యంలో తగ్గిపోయిన జలాన్ని నింపేందుకు లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌లోని బాహుబలి నాలుగో మోటారును అధికారులు రాత్రి ప్రారంభించారు. ఏడు మోటార్లు ఉన్న ఈ పంప్‌హౌస్‌లో ప్రస్తుతం 5, 4, 1వ మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తూ, ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీటిని మధ్య మానేరుకు ఎత్తిపోస్తున్నాయి. శనివారం రాత్రి రెండవ నంబర్ మోటారును అధికారులు ఆన్ చేశారు. దీంతో మరో మూడు వేల క్యూసెక్కుల నీరు మధ్యమానేరుకు తరలివెళ్లనుంది. ప్రస్తుతం మూడు పంపుల ద్వారా 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు తోడేస్తున్నారు. ఎల్ఎండీకి జలకళ వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు పూర్తయినా డెడ్ స్టోరేజీలోనే ఉన్న లోయర్ మానేరుడ్యాం (ఎల్ఎండీ)కు జలకళ సంతరిం చుకుంది. మొదటిసారి కాళేశ్వరం జలాలు కరీంనగర్‌కు రావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డ్యాంలోని గంగమ్మ దేవాలయం వద్ద జలహారతి నిర్వహించారు. కేసీఆర్ నిలువెత్తు కటౌట్లకు జలాభిషేకం చేసి ప్రజాప్రతినిధులు నెత్తిన జలాలు చల్లుకుంటూ పులకించిపోయారు. -
పూర్తికానున్న ఆనికట్ పనులు
► రెండేళ్లుగా పనుల్లో జాప్యం ► రూ.3.3 కోట్లతో నిర్మాణం జైనథ్: మండలంలోని పిప్పల్‌గావ్ వాగుపై రూ.3.3కోట్లతో నిర్మిస్తున్న ఆనికట్ పనులు ఎట్టకేలకు పూర్తి కానున్నాయి. వాగు గుండా వృథాగా పోతున్న నీటిని లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి మళ్లించడానికి నిర్మిస్తు న్న ఈ ఆనికట్, ఒపెన్ కెనాల్ పనులు 2015 డిసెంబర్లో ప్రారంభమయ్యాయి. 2016 జనవరి నుండి జోరుగా పనులు నడుస్తున్నాయి. వాస్తవానికి 2016 ఆగస్ట్‌లో పూర్తి కావల్సి ఉన్నప్పటికీ కూడ నెలలుగా జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. రిజర్వాయర్‌కు స్వయం ప్రాతిపత్తి కోసం.. మండలంలో అతి ప్రధానమైన వాగుల్లో పిప్పల్‌గావ్ వాగు ఒకటి. దీని ద్వారా ప్రతీ ఏడాది నీరు వృథాగా పెన్‌గంగలో కలుస్తోంది. అయితే సాత్నాల ప్రాజెక్టు నీటిపై ఆధారపడి కొనసాగుతున్న లక్ష్మీపూర్ బ్యారేజీకి స్వయం ప్రాతిపత్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ వాగును రిజర్వాయర్‌లోకి మళ్లించేందుకు అధికారులు రూ.3.3కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే వాగుపై ఆనికట్ నిర్మించారు. ప్రస్తుతం ఒపెన్ కెనాల్ పనులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆనికట్ నుంచి 1300మీటర్ల మేరకు 3మీటర్ల వెడల్పుతో బ్యారేజీ వరకు ఒపెన్ కెనాల్ నిర్మిస్తే పనులు పూర్తి అయినట్లే. ఇక్కడ భూమిలో బండ రాయి విపరితంగా ఉండటంతో పనులు జాప్యం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పడు కాలువ పనులు దాదాపుగా పూర్తి అయినప్పటికి కూడ ఇంకా సాత్నాల ఎల్3 వద్ద కొంత బ్లాస్టింగ్ పనులు మిగిలిపోయాయి. దీంతో పాటు ఆనికట్ వద్ద కెనాల్ ప్రారంభమయ్యే ప్రదేశం తూము గేట్ నిర్మించాల్సి ఉంది. పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలోనే పిప్పల్‌గావ్ వాగు నీటిని రిజర్వాయర్‌లోకి మళ్లించి చేన్లకు సాగునీరు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. 20 రోజుల్లో పనులు పూర్తి చేస్తాం... వాస్తవానికి ఆనికట్ పనులు 2016 ఆగస్ట్‌లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో జాప్యం జరిగింది. సాత్నాల ఎల్3 కాలువ సమీపంలో బ్లాస్టింగ్ పనులు, ఆనికట్ వద్ద తూం గేట్ నిర్మాణం పనులు మినహా అన్ని పనులు పూర్తి అయ్యాయి. 20 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా పనులను వేగవంగం చేశాం. ఎట్టి పరిస్థితితుల్లోనూ ఈ సంవత్సరం వర్షాకాలలో వాగు నీరు వృథా పోకుండా, రిజర్వాయర్కి మళ్లిస్తాం. – మారుతి, సాత్నాల, జేఈ