మూడుముళ్లు కాదని..చదువులమ్మ ఒడికి
ఫలించిన కవలల కల
బాల్యవివాహానికి యత్నించిన తండ్రి
పెళ్లొద్దు.. చదువుకుంటామన్న బాలికలు
అధికారుల చొరవతో కళాశాలలో చేరిక
వారిది నిరుపేద కుటుంబం. సంతానం ఎక్కువ. వారిలో రామక్క, లక్ష్మక్క కవల పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివారు. మంచి మార్కులతో పాసయ్యారు. ఉన్నత చదువులు చదవాలని ఆశపడ్డారు. కటిక పేదరికాన్ని ఈదలేని ఆ తండ్రి వారికి పెళ్లిచేసి పంపేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లిచూపులు కూడా జరిగాయి. వారిలో రామక్కను పెళ్లికి అంతా సిద్ధమైంది.
ఇదంతా చూసిన రామక్క తన లక్ష్యం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటామని తల్లిదండ్రులను ఎదిరించింది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. ఎట్టకేలకు ఆ కవలల కల ఫలించింది. ఈ సంఘటన బెరైడ్డిపల్లె మండలం చిన్నపురంలో ఈనెల 4న వెలుగు చూసింది. అధికారుల చొరవతో ఇద్దరికీ ప్రభుత్వ కళాశాలలో శనివారం ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం దొరికింది.
పలమనేరు: చిన్నపురానికి చెందిన రాజప్పది పేద కుటుంబం. ఆయనకు ఏడుగురు సంతానం. వారిలో రామక్క, లక్ష్మక్క కవల పిల్లలు. వీరు లక్కనపల్లె హైస్కూల్లో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులయ్యా రు. ఒకరు 8.5. మరొకరు 6.5 పాయింట్లు సాధించి ప్రతిభ చూపారు. వారు బాగా చదవడమే ఆ కుటుం బానికి శాపమైంది. పై చదువులకు ఆర్థిక స్తోమత లేక ఇరువురికీ పెళ్లిళ్లు చేసి పంపేయాలని తండ్రి భావించాడు. దీంతో పొరుగూరికి చెందిన ఓ వ్యక్తితో ఈనెల 4న పెళ్లి చూపులు జరిగాయి. ఆ ఇద్దరు కవల పిల్లల్లో రామక్కను పెళ్లి చేసుకోవడానికి లగ్నం కుదిరింది.
అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. చదువుకుంటామంటూ తల్లిదండ్రులను బతిమలాడారు. వారు కుదరదన్నారు. దీంతో రామక్క గ్రామంలోని ఓ కాయిన్ బూత్‌లో తనకు తెలిసిన వారికి ఈ విషయం గురించి ఫోన్లో చెప్పింది. ఈ విషయం ఐసీడీఎస్ సీడీపీవో రాజేశ్వరి చెవినపడింది. దీంతో ఆమె హుటాహుటిన ఆ శాఖ పీడీ ఉషాఫణికర్, ఆర్జేడీ శారదకు సమాచారమిచ్చింది. వెంటనే గ్రామంలోని డ్వాక్రా మహిళలను వారి ఇంటి వద్దకు పంపారు. 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. వీరందరూ కలసి అదేరోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ గ్రామానికి చేరుకున్నారు.
గ్రామ ఎంపీటీసీ వాసు సహకారంతో పంచాయితీ పెట్టారు. అక్కడ కూడా ఆ ఇద్దరు అమ్మాయిలు తాము చదువుకుంటామంటూ విన్నవించారు. దీంతో గ్రామస్తులంతా కలసి వారు చదువుకోవాల్సిందేనంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ భారాన్ని నెత్తినేసుకున్న సీడీపీవో తమ అధికారులతో పాటు పలమనేరులోని రోప్స్ స్వచ్ఛంద సంస్థ, చిత్తూరులోని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్)తో సంయుక్తంగా వారిని కళాశాలలో చేర్పిం చేందుకు ఇన్నాళ్లుగా ప్రయత్నించారు.
తిరుపతి, అనంతపురంలో ప్రయత్నించగా అప్పటికే ఇంటర్ అడ్మిషన్లు పూర్తయిపోయాయి. ఎట్టకేలకు వీరంతా జిల్లా అధికారులను సంప్రదించి స్పెషల్ కేటగిరి ద్వారా చిత్తూరులోని క్రిష్ణవేణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శని వారం ఇద్దరినీ చేర్పించారు. అక్కడే ఎస్సీ బాలికల హాస్టల్లో సీటు ఇప్పించారు. ఇన్నాళ్లు అధికారులు పడ్డ శ్రమ ఫలించింది. ఆ ఇద్దరు కవలల ఆశ నెరవేరింది. ఇద్దరూ చదువుల తల్లి ఒడిని చేరారు.