lalit modi controversy
-
'లలిత్‌గేట్'తో కాంగ్రెస్ లో ముసలం
బెంగళూరు: లలిత్‌గేట్ వివాదంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, కర్ణాటక మాజీ గవర్నర్ హన్స్ రాజ్ భరద్వాజ్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడైన ఆయన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు సీనియర్ నాయకులపైనా ధ్వజమెత్తారు. పార్టీపై పట్టులేని రాహుల్ వాస్తవాలను అర్థంచేసుకునే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ వివాదంలోచిక్కుకున్న వసుంధరా రాజే, సుష్మస్వరాజ్ల రాజీనామాల కోసం పట్టుబట్టలేకపోతున్నారని మండిపడ్డారు. రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే స్థితిలో కాంగ్రెస్ నేతలున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకత్వానికి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉందా అని భరద్వాజ్ సవాల్ చేశారు. 'లలిత్‌గేట్'తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ ముసలం మొదలైందని భరద్వాజ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, సుష్మ, రాజె రాజీనామా చేయాలని పి. చిదంబరం, జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ తదితర సీనియర్ నాయకులు గట్టిగానే పట్టుబడుతున్నారు. -
వసుంధర రాజెతో గడ్కరీ భేటీ
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెతో సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. లలిత్ మోదీ వ్యవహారంలో వసుంధర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాజెపై ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమె బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నేతతో సమావేశం కావడం ఇదే తొలిసారి. మోదీ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు వసుంధర ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశం కావాలని ప్రయత్నించినా వీలు కాలేదు. కాగా మోదీ వ్యవహారంలో రాజెకు బీజేపీ అధినాయకత్వం బాసటగా నిలిచింది. రాజె కుమారుడు, ఎంపీ దుష్యంత్, మోదీల సంబంధాలు వ్యాపారపరమైనవని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. -
'సీఎంగా ఉండే నైతిక హక్కు మీకు లేదు'
లలిత్ మోదీ వివాదంలో పాత్ర ఉందని ఆరోపణలు వచ్చినందున ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు వసుంధర రాజెకు లేదని కేంద్ర మాజీమంత్రి సచిన్ పైలట్ అన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అటు సుష్మా స్వరాజ్, ఇటు వసుంధర రాజె.. ఇద్దరి పైనా మండిపడ్డారు. సుష్మా స్వరాజ్ తన కేంద్ర మంత్రి పదవికి, వసుంధర రాజె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నేరస్థుడికి బీజేపీ మద్దతు పలుకుతోందని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు.