టాప్ ర్యాంక్ రేటు.. 20 లక్షలు!
బిహార్ టాప్ ర్యాంకర్లకు చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొట్టకోస్తే అక్షరం ముక్క రాకుండానే టాప్ ర్యాంకు సాధించడానికి వాళ్లు ఒక్కొక్కళ్లు ఎంత ముట్టజెప్పారో తెలుసా.. అక్షరాలా రూ. 20 లక్షలు. ఈ విషయాన్ని స్వయంగా బిహార్ స్కూలు పరీక్షల బోర్డు (బీఎస్ఈబీ) చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ అంగీకరించారు. అలాగే, అసలు ఏమాత్రం సదుపాయాలు లేని జూనియర్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి కూడా 4 లక్షల చొప్పున లంచం తీసుకున్నానని చెప్పారు. సింగ్తో పాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాను మూడు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారణలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి.
తన హయాంలో ఆయనగారు దాదాపు 100 కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ దంపతులిద్దరినీ సోమవారం నాడు వారణాసిలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాకెట్ మొత్తానికి ఓ కాలేజి ప్రిన్సిపల్ బచ్చారాయ్ రింగ్ లీడర్ అని తెలిసింది. బీఎస్ఈబీ నిర్వహించే సీనియర్ ఇంటర్ పరీక్షలలో టాప్ ర్యాంకులు రావడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ దందా మొదలుపెట్టింది అతడేనని అంటున్నారు. బిహార్ హయ్యర్ సెకండరీ విద్య డైరెక్టర్ రాజీవ్ కుమార్ ప్రసాద్ రంజన్ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు.