భూసేకరణ సవరణ బిల్లుకు పచ్చజెండా?
- అభ్యంతరాలు వ్యక్తం చేయని కేంద్ర హోంశాఖ
- ఆమోద ముద్ర కోసం
- రాష్ట్రపతికి నివేదన
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఇతర ప్రజోపయోగ సంస్థల ఏర్పాటు తదితరాలకు అవసరమైన భూమిని సేకరించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న భూసేకరణ చట్టం త్వరలో అమలులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం–2013కు కీలక సవరణలు చేస్తూ ఇటీవల శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన విషయం తెలిసిందే. దానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో బిల్లును ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది.
అక్కడ ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత రాష్ట్రపతి ఆమోదా నికి వెళ్లాల్సి ఉంటుంది. బిల్లులో లోపాలున్నా, మరేదైనా అభ్యంతరాలున్నా కేంద్ర హోంశాఖ తిప్పి పంపుతుంది. కానీ ఎలాంటి అభ్యంత రాలు వ్యక్తం చేయకుండా, శాసనసభ ఆమో దించిన బిల్లును యథాతథంగా రాష్ట్రపతి భవన్కు పంపింది. మరో రెండుమూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఆమోదమే తరువాయి..
కేంద్ర చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్రానికి ఉందా లేదా అన్న విషయంలో ఇటీవల శాసనసభలో వాడీవేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. అసలు చట్ట సవరణ చేయడం ద్వారా ప్రజల భూములను సహే తుక కారణాలు చూపకుండా లాక్కునే అధి కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందడమేనంటూ విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. భూములు కోల్పోకుండా ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న అంశాలను చట్టం నుంచి తొలగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూల అంశాలను చేర్చి సవరణ చేస్తోందంటూ దుమ్మెత్తి పోశాయి. అయినా ఈ సవరణ చెల్లుబాటు కాదన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేశాయి.
అసలు అది కొత్త చట్టమా, సవరణనా అన్న విషయంలోనూ తీవ్ర గందరగోళం నెలకొన్న తరుణంలో.. సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు తయారీకి ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రితో చర్చించి, అక్కడి నుంచి వచ్చిన సూచననలకు తగ్గట్టుగానే ముసాయి దాను సిద్ధం చేసుకుంది. దీంతో బిల్లుకు కేంద్ర హోం శాఖ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా రాష్ట్రపతి భవన్కు పంపింది. ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి.. సవరణలు జరుపుకొన్న చట్టం అమలులోకి రానుంది.