శ్రీ సత్యసాయి: నూతన జిల్లాలో మరో సెజ్
పరిశ్రమల ఏర్పాటుతో ప్రజల ఆర్థిక సామర్థ్యం పెంపొందుతుంది. తలసరి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనా సాధ్యమవుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. కొత్త జిల్లా శ్రీ సత్యసాయిలో ఆర్థిక రథం పరుగులు పెట్టించడానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మరో సెజ్ ఏర్పాటు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త జిల్లాలో ఆర్థిక కాంతులు మరింతగా విస్తరించనున్నాయి.
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: పరిశ్రమల ఖిల్లాగా ఖ్యాతి పొందిన శ్రీ సత్యసాయి జిల్లాలో మరో పెద్ద సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు కానుంది. చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద 880 ఎకరాల్లో అందుబాటులోకి రానుంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చిలమత్తూరు మండలం బెంగళూరుకు కేవలం 100 కి.మీ దూరంలోనే ఉండటంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రైతులకు కళ్లు చెదిరే పరిహారం..
సెజ్ ఏర్పాటు ద్వారా భూములు కోల్పోయే రైతులు తొలుత ధర తక్కువ ఇస్తారేమే అని లోలోన ఆందోళన చెందారు. అంతే కాకుండా 880 ఎకరాల్లో పట్టా భూములు కేవలం 174 ఎకరాలు మాత్రమే ఉండగా, మిగిలినదంతా అసైన్మెంట్ భూమే. అయితే ఎలాంటి పక్షపాతమూ కనబరచకుండా భూమి కోల్పోయే ప్రతి రైతుకూ పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా కళ్లు చెదిరే రీతిలో ఎకరాకు రూ.25 లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిర్ణయించిన మేర రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు.
భూముల ధరలకు రెక్కలు..
ప్రభుత్వం సెజ్ ఏర్పాటు కోసం భూ సేకరణ చేస్తోందన్న విషయం బయటకు రాగానే టేకులోడు పరిసర ప్రాంతాల్లో భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రభుత్వమే రూ. 25 లక్షలు ప్రకటించడంతో చుట్టుపక్కల భూములను మూడు రెట్లు అధికంగా చెల్లించి కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.
రెండు జాతీయ రహదారులకు అనుసంధానం..
టేకులోడు సమీపంలో ఏర్పాటు చేస్తున్న సెజ్‌కు రెండు జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉంది. అటు 544ఈ జాతీయ రహదారి పూణే జాతీయ రహదారికి, ఇటు 44 వ జాతీయ రహదారి బెంగళూరు, హైదరాబాద్‌కు కనెక్టివిటీ కలిగిఉంది. దీంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కియా కార్ల తయారీ పరిశ్రమ, నాసిన్ ట్రైనింగ్ సంస్థ, ఇండజ్ జీన్ వ్యాక్సిన్ కేంద్రం వంటి పరిశ్రమలు దగ్గరగా ఉండటం కూడా ప్రధాన అనుకూలతలుగా మారనున్నాయి.
వేలమందికి ఉద్యోగావకాశాలు..
సెజ్ కార్యరూపం దాల్చితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాది దొరకనుంది. బయట రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే బాధ తప్పుతుంది. దీంతో నిరుద్యోగులకు సెజ్‌ల ఏర్పాటు కల్పతరువుగా మారనుంది.
ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ ఉత్పత్తుల హబ్‌గా మారుస్తాం
టేకులోడు వద్ద ఏర్పాటు చేస్తున్న సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)ను ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ ఉత్పత్తుల హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఇవే కాకుండా ఏ ఇతర కంపెనీలు వచ్చినా ఆహ్వానిస్తాం. ప్రతిపాదిత సెజ్ ప్రాంతానికి నీటి సదుపాయం కల్పించడానికి రూ.7 కోట్లతో పైప్‌లైన్ పనులు ప్రారంభించాం. ఏపీఐఐసీకి చెందిన 250 ఎకరాల భూమి ఉన్నా, మరో 850 ఎకరాలను భూమి సేకరించాం. బెంగళూరు నగరానికి దగ్గరగా ఉండడంతో పరిశ్రమలు అధికంగా వస్తాయని భావిస్తున్నాం.
– మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్