ప్రైవేటు యూనివర్సిటీలకు రాజధానిలో భూములు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో 15 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా మూడు ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమిటీ యూనివర్సిటీలు తమ క్యాంపస్లను అమరావతిలో నెలకొల్పడానికి వీలుగా వాటికి భూములను కేటాయించారు. వాటితో పాటు మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా భూముల కేటాయింపును ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇంకా పలు నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక క‍్లస్టర్ల ఏర్పాటుకు కావల్సిన భూములు కూడా కేటాయించాలని నిర్ణయించారు.
స్థానికతకు సంబంధించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారి విషయంలో పాటించాల్సిన నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని విభాగాల్లో ఇన్నోవేషన్ శాఖలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సర్వేకు సంబంధించి భవిష్యత్తులో మంత్రులు ఎలాంటి చొరవ తీసుకోవాలనే అంశంపై చర్చించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై చర్చ సాగింది. పట్టిసీమ ప్రాజెక్టు ఇంజనీర్లకు ఒక నెల జీతాన్ని ఇంక్రిమెంటుగా ఇవ్వాలని నిర్ణయించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి పలు అధికారాలు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీలలో వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. మచిలీపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూసమీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.