భూములు కాజేసిన వారిపై దృషి పెటపెట్టండి
- ఓయూ భూములపై సీఎం కేసీఆర్కు దత్తాత్రేయ సూచన
న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూములను కాజేసిన వారిపై దృష్టి పెట్టాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి కేసీఆర్కు సూచించారు. పేదలకు పక్కా ఇళ్లు కట్టడం మంచి కార్యక్రమమని, అయితే ఓయూ భూముల సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలన్నారు. సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు.
ఓయూకు చెందిన భూముల్లో పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పై విధంగా స్పందించారు. ఓయూ భూముల్లో నివాసం ఉంటున్న సిబ్బంది అనేక ఏళ్ల నుంచి డ్రైనేజీ, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఓయూ భూముల్లో ఇతరులు ఉండటానికి వీళ్లేదని సిబ్బంది అంటున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలన్నారు. కాగా, దీన్ని వివాదం చేయదల్చుకోలేదన్నారు. వెంకయ్య నాయుడుతో భేటీలో రాష్ట్రం లోని మున్సిపాలిటీల్లో తాగునీరు, మురుగునీటి పెండింగు ప్రాజెక్టులపై చర్చించినట్టు ఆయన వెల్లడించారు.