సర్కారు వెబ్సైట్లో డాక్యుమెంట్లు ఢమాల్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ను స్తంభింపజేసిన అధికారులు
* ఐజీఆర్ఎస్లో కనిపించని భూములు, స్థలాల డాక్యుమెంట్లు
* ‘రాజధాని దురాక్రమణ’పై ‘సాక్షి’ కథనంతో కలకలం
* డాక్యుమెంట్లు బయటకు ఎలా వచ్చాయంటూ
* అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
* ఇకపై ఒక్కటీ బయటకు రాకూడద ని ఆదేశం
* బినామీల దందా, మోసాలు బయటపడతాయన్న ఆందోళన!
సాక్షి, హైదరాబాద్
రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’ ప్రచురించిన ససాక్ష్య కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో, అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలయ్యింది. ‘అసలు డాక్యుమెంట్లు ఎలా బయటకు వచ్చాయి..? ఇకపై ఒక్క డాక్యుమెంటు కూడా బయటకు రావడానికి వీలులేదు...’ అంటూ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుక్షణమే ప్రభుత్వ వెబ్సైట్లో డాక్యుమెంట్లు మాయమైపోయాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్ ఐజీఆర్ఎస్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కన్పించకుండా పోయాయి. ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్లి డాక్యుమెంటు నంబర్ ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత భూమి/ స్థలం అమ్మకం దస్తావేజు నకలు (సర్టిఫైడ్ కాపీ) చూసుకునే వెసులుబాటు చాలాకాలంగా ఉంది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ వెబ్సైట్లో డాక్యుమెంట్లు కనిపించకుండా చేయడం గమనార్హం. దస్తావేజుల నకళ్లు కనిపిస్తే సర్కారు పెద్దల బినామీ కొనుగోళ్లు, మరిన్ని మోసాలు బయటపడతాయనే భయంతోనే అవి కనిపించకుండా వెబ్సైట్ను స్తంభింపజేసినట్లు స్పష్టమవుతోంది.
అధికారులపై బాబు చిందులు: రాజధాని అమరావతి ప్రాంతంలో 25,000 ఎకరాల భూములను ప్రభుత్వ పెద్దలు అప్పనంగా, కారుచౌకగా కొట్టేయడంపై ‘రాజధాని దురాక్రమణ’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. కంచే చేనును మేసిన చందంగా సీఎం చంద్రబాబు దర్శకత్వంలో ఆయన కుమారుడు లోకే శ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ బినామీలతో సాగించిన భూ మాఫియాపై పక్కా ఆధారాలతో ‘సాక్షి’ ప్రచురించిన కథనాలతో ముఖ్యమంత్రికి నోట మాటరాలేదు. వాస్తవాలను ఖండించలేక, చేసిన మోసాలను ఒప్పుకోలేక ‘డాక్యుమెంట్లు ఎలా బయటకు వచ్చాయంటూ..’ బాబు అధికారులపై మండిపడ్డారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెబ్సైట్లో సర్టిఫైడ్ కాపీలు కనిపించకుండా బ్లాక్ చేశారు.
సీఎం వైఖరి సరికాదంటున్న అధికారులు
రాజధాని ప్రాంతంలో రాబందుల్లా భూములను దోచుకున్న విషయాన్ని ఖండించాల్సింది పోయి, డాక్యుమెంట్లు ఎలా బయటకు వచ్చాయంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని అధికార వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ‘భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎవరైనా తీసుకోవచ్చు. అవేమీ రహస్యం కాదు. అలాంటప్పుడు అవి ఎలా బయటకు వచ్చాయని మమ్మల్ని అడగడంలో అర్థమే లేదు. మొన్నటికి మొన్న సాగునీటి ప్రాజెక్టుల ప్యాకేజీల అంచనా వ్యయం పెంచడం ద్వారా కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వాటాలు పంచుకున్న విషయాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసినప్పుడు కూడా సమాచారం బయటకు ఎలా వెళ్లిందంటూ సీఎం మాపై చిందులేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చాలని సీఎం చెప్పడం ఏమిటి?’ అంటూ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదానికీ అధికారులను బలి చేయడం ముఖ్యమంత్రికి అలవాటై పోయిందని వాపోతున్నారు.