landloosers
-
సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
కాసిపేట : మండలంంలోని కెకె ఓపెన్‌కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెంలో బుధవారం సామాజిక ఆర్ధిక స్థితిగతులపై చేస్తున్న సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. గతవారం రోజుల క్రితం సర్వేలు ప్రారంభించగా తమకు పునరావాసానికి స్థలం ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలని అడ్డుకోవడంతో సర్వే నిలిచిపోయింది. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను కలవగా సింగరేణి చూపిన స్థలంతో పాటు గ్రామస్తులు చూసుకున్న అనువైన చోట కేటాయిస్తారని రెండు మూడు ప్రదేశాల్లో స్థలం చూపించడం జరిగింది. తిరిగి సర్వేకు రావడంతో స్థల కేటాయింపుపై స్పష్టత వచ్చాకే సర్వేలు చేయాలని అడ్డుకున్నారు. అధికారులు ముందు సర్వే చేసినట్లయితే ఎంత స్థలం అవసరమో తేలుతుందని, అనంతరం ఇష్టం ఉన్నచోట స్థలం కేటాయించనున్నట్లు తెలిపినప్పటికీ గ్రామస్తులు వినకుండా అధికారులను తిప్పి పంపించారు. మందమర్రి డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, బెల్లంపల్లి డీటీ షరీఫ్ తదితరులున్నారు. -
ఓపెన్‌కాస్టు సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
ఏం ఇస్తారో చెప్పి సర్వేలు చేయాలి దుబ్బగూడెం గ్రామస్తులు కాసిపేట : మండలంలోని దుబ్బగూడెం గ్రామస్తులు మంగళవారం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కోసం గ్రామంలో చేస్తున్న సర్వేను అడ్డుకుని అధికారులను తిప్పి పంపారు. సింగరేణి యాజమాన్యం కేకే ఓపెన్‌కాస్టు కోసం దుబ్బగూడెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. వైశాల్యం సర్వే అనంతరం ఇంటి విలువ లెక్కించేందుకు తిరిగి సర్వే చేయాల్సి ఉంది. దీంతో సర్వే చేసేందుకు ఏంఆర్ఐ కమల్‌సింగ్ ఆధ్వర్యంలో సర్వేయర్లు సర్వే చేస్తుండగా ముందు ఏం ఇస్తారో చెప్పి సర్వేలు చేయాలని అప్పటి వరకు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ప్రజల ఒప్పందం లేకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఒకపక్క ఓసీ వద్దని ప్రజలు ఆందోళనలు చేస్తుంటే కనీసం వారికి ఏం ఇస్తారో, ఎక్కడ స్థలం ఇస్తారో చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సర్వేలు పూర్తి అవుతున్నాయని ప్రకటించడం దారుణమన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారులు నడుచుకోవాలని సూచించారు. అధికారులతో వాదనకు దిగిన గ్రామస్తులు సర్వే నిలిపివేసి అధికారులను అక్కడి నుంచి పంపించారు. నాలుగు రోజులు గడువు ఇవ్వాలి – జెడ్పీటీసీ సత్తయ్య సర్వేలకు నాలుగు రోజులు గడువు ఇవ్వాలని జెడ్పీటీసీ రౌతు సత్తయ్య కోరారు. సర్వే అడ్డగించిన అనంతరం అక్కడకు చేరుకున్న జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రజలు ఏం ఇస్తారో చెప్పాలని కోరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రజల సూచన మేరకు నాలుగు రోజులు గడువు ఇచ్చి అనంతరం సర్వేలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట ప్రజలకు పునరావాసంపై అవగహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులున్నారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
అఖిల పక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఖమ్మం సిటీ : ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని,ఓపెన్ కాస్ట్, సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన బాధితులకు 2013 చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆఖిల పక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల కమిటీ జిల్లా కన్వీనర్ నున్న నాగేశ్వరరావు ఆ«ధ్యక్షతన శుక్రవారం ఖమ్మంలోని మంచికంటిభవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ,వామపక్ష పార్టీల నేతలు మాట్లాడారు. ప్రభుత్వం నిర్వాసిత గ్రామాలను సందర్శించకుండా ఆంక్షలు విధించటం శోచనీయమని ఆఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. 2013 భూనిర్వాసితుల చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పోడుస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ ఆధికారంలోకి వచ్చిన తరువాత భూసేకరణ చట్టాలకు సవరణ తెచ్చేందుకు ప్రయత్నించగా దానిని వామపక్ష రైతు సంఘాలు తిప్పి కొట్టాయన్నారు. జిల్లాలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్టు విషయంలో ఇవే సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. భూసేకరణకు ముందుగానే డిటైల్ ప్రాజెక్టు రిపోర్టును వెల్లడించడంతో పాటు విధిగా గ్రామసభలు నిర్వహించి రాజకీయ పక్షాల సలహాలు సేకరించాలన్నారు. కనీసం 70 శాతం మంది ప్రజలు అమోదిస్తేనే భూసేకరణ చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిబంధన మేరకు భూసేకరణ జరపాలి తప్ప బలవంతానికి పాల్పడితే సహించబోమన్నారు.రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్,సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు,న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్,జిల్లా నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరావు,టీడీపీ నాయకులు జీవన్,తుడం దెబ్బ జిల్లా కన్వీనర్ నర్సింహారావు,నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, నున్న నాగేశ్వరరావు, రామనాథం, తోటకూర శివయ్య,నాగేశ్వరరావు, మాదినేని రమేష్,వీరభద్రం పాల్గొన్నారు.