మాట్లాడుతున్న సారంపల్లి మల్లారెడ్డి
- అఖిల పక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ఖమ్మం సిటీ : ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని,ఓపెన్ కాస్ట్, సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన బాధితులకు 2013 చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆఖిల పక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల కమిటీ జిల్లా కన్వీనర్ నున్న నాగేశ్వరరావు ఆ«ధ్యక్షతన శుక్రవారం ఖమ్మంలోని మంచికంటిభవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ,వామపక్ష పార్టీల నేతలు మాట్లాడారు. ప్రభుత్వం నిర్వాసిత గ్రామాలను సందర్శించకుండా ఆంక్షలు విధించటం శోచనీయమని ఆఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. 2013 భూనిర్వాసితుల చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పోడుస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ ఆధికారంలోకి వచ్చిన తరువాత భూసేకరణ చట్టాలకు సవరణ తెచ్చేందుకు ప్రయత్నించగా దానిని వామపక్ష రైతు సంఘాలు తిప్పి కొట్టాయన్నారు. జిల్లాలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్టు విషయంలో ఇవే సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. భూసేకరణకు ముందుగానే డిటైల్ ప్రాజెక్టు రిపోర్టును వెల్లడించడంతో పాటు విధిగా గ్రామసభలు నిర్వహించి రాజకీయ పక్షాల సలహాలు సేకరించాలన్నారు. కనీసం 70 శాతం మంది ప్రజలు అమోదిస్తేనే భూసేకరణ చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిబంధన మేరకు భూసేకరణ జరపాలి తప్ప బలవంతానికి పాల్పడితే సహించబోమన్నారు.రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్,సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు,న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్,జిల్లా నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరావు,టీడీపీ నాయకులు జీవన్,తుడం దెబ్బ జిల్లా కన్వీనర్ నర్సింహారావు,నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, నున్న నాగేశ్వరరావు, రామనాథం, తోటకూర శివయ్య,నాగేశ్వరరావు, మాదినేని రమేష్,వీరభద్రం పాల్గొన్నారు.