lands allocations
-
చంద్రబాబు సర్కార్ మరో భూ పందేరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం మరో భూ పందేరానికి తెరలేపింది. చింతాస్ గ్రీన్ ఎనర్జీ సంస్థకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందటే పుట్టిన చింతాస్కు భారీగా భూ కేటాయింపులు చేసింది. 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎకరం 31 వేలకే లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో చింతాస్ ఏర్పాటు చేయగా, చింతాస్కు ఆగమేఘాల మీద భూముల కేటాయింపులు జరిగిపోయాయి. చింతాస్ డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. 2 నెలలకే భారీగా భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో భూములను కేటాయించింది. హరే సముద్రం, బుల్లసముద్రం, ఉప్పెర్లపల్లి, ఎర్రబొమ్మన హల్లి, కల్లుమరి, మానూరె పరిసర గ్రామాల్లో భూముల కేటాయింపు జరిగింది.కాగా, ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కారు అప్పనంగా కట్టబెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
లోకేశా.. ఇది లోకల్ ప్రేమేనా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఔత్సాహికులు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి విదేశీ సంస్థలకే విలువైన భూములు ఇస్తోందన్న విమర్శలపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలు, ట్విట్టర్ వేదికగా ఇస్తున్న సమాధానాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఐటీ రంగంలో విశాఖలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించే వారికి ఎర్ర తివాచీ వేస్తామని, ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త శ్రీనుబాబు.. పల్సస్ కంపెనీ పెట్టేందుకు వస్తే ప్రభుత్వం భూములు కేటాయించిందని లోకేష్ ఆర్భాటంగా ప్రకటించారు. వాస్తవానికి పల్సస్ కంపెనీకి ఇప్పటికీ గజం భూమి కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా పొందిన పల్సస్ సంస్థ ఐటీ రంగంలో మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తామని దరఖాస్తు చేసి రెండేళ్లయినా ఇంకా పరిశీలనలోనే ఉంది. ఐదు నుంచి పది ఎకరాల్లోపు కేటాయించగలమని, ఎకరం ధర రూ.3 కోట్ల మేర ఉంటుందని సదరు పల్సస్ సంస్థకు సర్కారు చెబుతూ వస్తోంది. అయితే ఇప్పటికీ కేటాయింపుపై స్పష్టత లేకపోగా, నారా లోకేష్ మాత్రం పల్సస్ సంస్థకు కేటాయించేశామని చెప్పడం గమనార్హం. ఇదే విషయం ఇప్పుడు ఐటీరంగంలో చర్చనీయాంశమైంది. ప్రాంక్లిన్ టెంపుల్టన్కు అడ్డగోలు కేటాయింపులు ప్రాంక్లిన్ టెంపుల్టన్కు భూముల కేటాయింపులపై విమర్శలకు సమాధానంగానే లోకేష్ పల్సస్ ప్రస్తావన తెచ్చి.. మరిన్ని విమర్శలకు తావిచ్చారు. రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టే టెంపుల్టన్ రెండువేల ఉద్యోగాలు కల్పిస్తుందని లోకేష్ చెప్పారు. అందుకే 40 ఎకరాల భూములు కట్టబెట్టామని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి టెంపుల్టన్ 25 ఎకరాలే కోరితే.. అత్యంత ఉదారంగా 40ఎకరాలు కేటాయించడంపై ఇప్పటికీ వివాదం చెలరేగుతోంది. తొలుత మల్టీనేషనల్ కంపెనీ టెంపుల్టన్, దేశీయ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్‌కు కలిపి 40 ఎకరాలు కేటాయిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు సంస్థలు సంయుక్తంగా భూమిని అడగడంపై వివాదంతో పాటు.. ఇన్నోవా సొల్యూషన్స్ సంస్థ బాధ్యుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని బయటకు రావడంతో సర్కారు వెనక్కి తగ్గి జీవోలో మార్పులు చేసింది. ఇన్నోవా సొల్యూషన్స్‌ను తప్పించి మొత్తం 40ఎకరాలూ టెంపుల్టన్‌కే కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఎకరానికి 40 రూ.లక్షలు చొప్పున రిషికొండలోని ఐటీ హిల్స్‌లో భూమి కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ కేటాయింపుల్లోనూ అక్రమాలు దాగున్నాయి. 40 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నా..రెండున్నరవేల ఉద్యోగాలేనా? ఐటీ నిబంధనల ప్రకారం.. భూములు తీసుకున్న కంపెనీలు ఎకరానికి 500మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఆ మేరకు టెంపుల్టన్ 40ఎకరాలకు గానూ 20వేల మందికి ఉద్యోగాలివ్వాలి. కానీ లోకేష్ మాత్రం టెంపుల్టన్ కంపెనీ 2500 ఉద్యోగాలిస్తుందని గొప్పగా చెప్పారు. 20వేలమందికి ఇవ్వాల్సిన కంపెనీ 2,500మందికి ఇస్తామంటే సదరు మంత్రి ఘనంగా ప్రకటించడం విమర్శలపాలవుతోంది. మరోవైపు 3వేల ఉద్యోగాలు కచ్చితంగా కల్పిస్తామని చెబుతున్న శ్రీకాకుళం యువ పారిశ్రామికవేత్తకు చెందిన పల్సస్ కంపెనీకి ఐదు నుంచి పది ఎకరాల్లోపే ఇస్తామని చెబుతున్నా.. ఇంకా సాగదీస్తుండటం గమనార్హం. ఇక విదేశీ సంస్థ అయిన టెంపుల్టన్కు రిషికొండ ఐటీ హిల్స్‌లో ప్రైమ్ లొకేషన్లో ఎకరం రూ.40 లక్షలకు కట్టబెట్టిన సర్కారు.. పల్సస్‌కు మాత్రం ఎకరం రూ. 3కోట్ల ధర చెబుతోంది. ఇప్పుడు ఇదే విషయం ఐటీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇప్పటివరకు స్థానికులకు ఒక్కరికి కూడా భూములు కేటాయించకపోవడం కూడా చర్చకు తెరలేపింది. విశాఖ నగరానికే చెందిన 12మంది ఐటీ ప్రతినిధులు భూముల కోసం దరఖాస్తు చేసుకోగా, టీడీపీ సర్కారు కొలువుదీరిన నాలుగేళ్లలో ఒక్క దరఖాస్తుకు కూడా మోక్షం కలగలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే లోకేష్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రకటనలు చేయడం నవ్వులపాలవుతోంది. -
బాబు భూ సంతర్పణలపై కేంద్రానికి ఫిర్యాదు
- విలువైన భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ఎలా కట్టబెడతారు? - ప్రభుత్వ భూ కేటాయింపుల ప్రక్రియపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించండి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈ.ఏ.ఎస్. శర్మ లేఖాస్త్రం సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అత్యంత విలువైన సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తుండటాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆక్షేపించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడలో రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఓ ఐటీ సంస్థకు.. ఏపీఐసీకి చెందిన విలువైన 489 ఎకరాల భూమిని వీబీసీ ఫర్టిలైజర్స్‌కు అత్తెసరు ధరలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి.. ఈ భూదందా వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు శనివారం శర్మ లేఖాస్త్రం సంధించారు. రాజధాని నిర్మాణం నుంచి భూ కేటాయింపుల వరకూ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను ఆక్షేపిస్తూ, విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శర్మ ఎప్పటికప్పుడు లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు మరో లేఖ రాశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012న ఇచ్చిన తీర్పులో భూ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సూచనలు చేసిందని గుర్తు చేశారు. రోజు రోజుకూ భూముల ధరలు ఆకాశన్నంటోన్న నేపథ్యంలో.. ప్రభుత్వ భూములు లభ్యత, వాటి పరిరక్షణ కీలకంగా మారిందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. ప్రభుత్వ భూముల కేటాయించే సమయంలో ప్రజాభ్యుదయాన్ని దృష్టిలో ఉంచుకుని.. సర్కారుకు లాభం చేకూరేలా సమర్థవంతమైన సంస్థలకు మాత్రమే కేటాయించాలని సుప్రీం కోర్టు స్పష్టీకరించిందని ఆ లేఖలో వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు లేకుండా సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో సర్వే నెంబరు 409లో ఏపీఐఐసీకి చెందిన రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని భూమిని ఓ ఐటీ సంస్థకు తక్కువ ధరకు ధారదత్తం చేయడాన్ని తప్పుబట్టారు. కృష్ణా జిల్లాలో జగయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబరు 93లో ఏపీఐఐసీకి చెందిన 499 ఎకరాల భూమిని అత్తెసరు ధరలకే వీబీసీ ఫర్టిలైజర్స్ సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలపమెంట్ ఎనాబ్లింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను 33 ఏళ్లకే లీజుకు ఇవ్వొచ్చునని.. కానీ 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. భూ కేటాయింపుల తీరును పరిశీలిస్తే ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని.. స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.